పెద్ద ఎత్తున యూట్యూబ్ చానల్స్‌పై గూగుల్ చర్యలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా 11వేల యూట్యూబ్ చానల్స్‌ను తొలగించినట్లు టెక్ కంపెనీ ప్రకటించింది. ఇందులో చైనా, రష్యాకు చెందిన చానల్స్ అత్యధికంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. చైనాకు చెందిన 7,700 ఛానెల్స్ ఉన్నాయని తెలిపింది. ఇంగ్లిష్, చైనీస్‌లో ప్రసారం చేసేవి ఉన్నాయని పేర్కొంది. అసత్య ప్రచారం, అపోహలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వాటిని బ్లాక్ చేసినట్లు చెప్పింది. భారత్‌లో చైనా కమ్యూనిస్టు పార్టీకి అనుకూలంగా ప్రచారాలు నిర్వహిస్తూ.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రశంసించే విధంగా కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. రష్యా చెందిన 2వేలకుపైగా యూట్యూబ్ చానల్స్‌పై వేటు వేసినట్లు పేర్కొంది.
ఆయా చానల్స్ నాటో, ఉక్రెయిన్‌పై విమర్శలు చేస్తూ రష్యాకు అనుకూలంగా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లుగా గూగుల్ గుర్తించింది. రష్యాలోని కొన్ని సంస్థలతో ఈ చానల్స్‌కు సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. వీటితో పాటు ఇజ్రాయెల్, తుర్కియే, ఇరాన్, ఘానా, అజర్‌బైజాన్, రొమేనియా దేశాలకు చెందిన యూట్యూబ్ చానల్స్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగే, నిరాధార, కల్పిత కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నాయని.. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని గూగుల్ తెలిపింది. ఇదిలా ఉండగా.. గూగుల్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇదే తరహా కారణాలతో దాదాపు 23వేల అకౌంట్స్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది.
