ప్రస్తుతం ఆన్లైన్లో ఏ సమాచారం కావాలన్నా.. ‘గూగుల్ సెర్చ్’ (Google) ఓపెన్ చేయాల్సిందే! ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 శాతం మందికి ఇదే పెద్దదిక్కు. ప్రతిరోజూ 850 కోట్ల శోధనలను ప్రాసెస్ చేస్తుంది. యూజర్లు అడిగిన సమాచారాన్ని.. సంబంధిత వెబ్‌లింక్‌లను వెతికి ఇస్తుంది. అయితే, చాట్‌జీపీటీ రాకతో గూగుల్ కూడా ‘ఏఐ’ వైపు (Google AI Mode) అడుగులు వేసింది. తన సెర్చ్ ఇంజిన్‌కు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను అనుసంధానం చేసింది. ఇప్పటికే అమెరికాలో విడుదలై విజయవంతంగా సేవలు అందిస్తున్న ‘గూగుల్ సెర్చ్ ఏఐ మోడ్’ ఇప్పుడు భారత్ (India)లోనూ అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి సైన్అప్స్ చేయకుండానే డైరెక్ట్‌గా మొబైల్, వెబ్ వెర్షన్లలో ఏఐ ఆధారిత శోధనలు చేసుకోవచ్చు. ఇప్పటివరకు గూగుల్‌లో ఏదైనా వెతికితే.. అందుకు సంబంధించిన వెబ్‌లింక్‌లు మాత్రమే వచ్చేవి. కొన్ని సంక్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు దొరికేవి కాదు. కానీ, ఈ సరికొత్త ఏఐ మోడ్ టూల్‌తో.. ఎలాంటి ప్రశ్నకైనా ఇట్టే సమాధానం దొరుకుతుంది. వినియోగదారుల మనసులో ఏమున్నా.. గూగుల్‌ను నేరుగా అడగొచ్చు. వాటికి గూగుల్ ఏఐ టూల్ ‘జెమిని’ సహాయంతో సమాధానాన్ని అందిస్తుంది. అందుకే, ఈ గూగుల్ సెర్చ్ ఏఐ మోడ్‌ను ‘జెమిని 2.5’ (Google’s Gemini 2.5 model) వెర్షన్‌గా చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇంగ్లీషులో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ సేవలు అందించనున్నది.
