హైదరాబాద్: ‘తెలంగాణ రైజింగ్’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. సదస్సుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పలువురు మంత్రులతో పాటు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సు జరుగుతోంది. సోమ, మంగళవారాల్లో ఇది కొనసాగనుంది. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
సదస్సు ప్రారంభానికి ముందు సీఎం రేవంత్‌రెడ్డి అక్కడికి చేరుకుని స్టాళ్లను పరిశీలించారు. వివిధ అంశాలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. సదస్సులో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈ సమిట్‌ను నిర్వహిస్తోంది.
సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిథులు వస్తుండటంతో అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్‌రెడ్డి ఈ సదస్సులో వివరించనున్నారు.























