AP: నెల్లూరులో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిందని ఓ యువతిపై కక్ష గట్టాడో ఉన్మాది. నేరుగా యువతి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి ఆమెను చంపేందుకు యత్నించాడు. అడ్డొచ్చిన ఆమె తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా వింజమూరు మండల కేంద్రానికి చెందిన నాగార్జున అనే యువకుడు కొంతకాలంగా పాతూరు గ్రామ పరిధిలోని యాదవ పాలెంలో ఉంటున్న ఓ యువతి వెంట పడుతున్నాడు. తనను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలని కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు. కానీ అతనితో పెళ్లికి సదరు యువతి ఒప్పుకోలేదు. అయినప్పటికీ నాగార్జున ఆమె వెంట పడటం మానలేదు.
ఈ క్రమంలోనే సదరు యువతికి ఇంట్లో వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన నాగార్జున ఆగ్రహంతో ఊగిపోయాడు. సదరు యువతికి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. కూతురిపై కత్తితో దాడి చేయడం చూసిన ఆమె తల్లి కాపాడేందుకు ప్రయత్నించింది. అడ్డొచ్చిన యువతి తల్లిపై కూడా నాగార్జున కత్తితో దాడి చేశాడు. అయితే, బాధితులు గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు అక్కడికి రావడంతో నాగార్జున పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన తల్లీ.. కూతుళ్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. నిందితుడు నాగార్జున కోసం గాలింపు చర్యలు చేపట్టారు.