ఏపీ మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం

Published on 

AP: ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు కానుంది. దీని అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం ప్రజలకు లబ్ధి ఎలా కలిగిస్తుందో స్పష్టంగా తెలిపేందుకు ‘జీరో ఫేర్ టిక్కెట్’ విధానాన్ని తీసుకురావాలని సీఎం సూచించారు. ఈ టిక్కెట్‌లో ప్రయాణికురాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది, టిక్కెట్ ధర ఎంత, అందులో ప్రభుత్వం ఎంత మేర రాయితీ ఇచ్చింది వంటి సమాచారం స్పష్టంగా ఉండాలన్నారు. ఇలా చేస్తే లబ్ధిదారులకు ప్రభుత్వ మద్దతు ఏ స్థాయిలో ఉందో ప్రత్యక్షంగా తెలుస్తుందని సీఎం పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

సోమవారం సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతోన్న ఈ పథకం వల్ల ఆయా ప్రభుత్వాలపై ఎంత వ్యయం పడుతోంది?, మన రాష్ట్రానికి ఇది ఎంత భారంగా మారే అవకాశం ఉందో? సీఎం సమీక్షించారు. ఏ పరిస్థితుల్లోనూ పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేయాలని స్పష్టం చేస్తూ, ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇది మహిళల ఆర్థిక, సామాజిక స్వావలంబనకు దోహదపడే చారిత్రాత్మక పథకంగా సీఎం పేర్కొన్నారు.

‘ఆర్టీసీ లాభాల బాటలోకి నడిపించాలి’

మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆర్టీసీపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు, నిర్వహణ వ్యయం తగ్గింపు, విభిన్న వ్యూహాల రూపకల్పన అవసరమని సీఎం పేర్కొన్నారు. సంస్థను లాభాల బాటలోకి తీసుకెళ్లే విధానంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక సూచనలు చేసారు. ఇకపై రాష్ట్రంలో ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులే కొనుగోలు చేయాలన్న దిశగా ముందడుగు వేయాలన్నది సీఎం ప్రధాన సూచన. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తే నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు అవసరమైన విద్యుత్‌ను ప్రభుత్వమే ఉత్పత్తి చేసుకోవాలని, అన్ని ఆర్టీసీ డిపోలలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టంగా ఆదేశించారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form