జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లోని పాండ్రేథాన్ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
శ్రీనగర్‌లో గత కొన్ని వారాలుగా ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా నమోదవుతుంది. చలి నుంచి కాపాడుకునేందుకు అందరూ రూమ్ హీటర్లపైనే ఆధారపడుతున్నారు. అయితే రూం హీటర్ నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ ఒక కుటుంబంలోని ఐదు గురి ప్రాణాలను తీసింది. ఆ గ్యాసు మూలంగా భార్య భర్తలు వారి ముగ్గురు పిల్లలు నిద్రలోనే ఊపిరాడక చనిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు. ఈ సంచలన ఘటన జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘోర ప్రమాద వార్త విన్న జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ హ్యాండిల్‌పై మృతుల కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపారు. శీతాకాలాన్ని నివారించడానికి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అభ్యర్థించారు.
స్థానిక సమాచారం ప్రకారం ఆదివారం అర్థరాత్రి ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మృతుడు, అతని కుటుంబం శ్రీనగర్‌లోని బారాముల్లా వాసులు. పాండ్రేథాన్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసించారు.
సరిగ్గా 6 సంవత్సరాల క్రితం, జనవరి 5, 2019న శ్రీనగర్‌లోని బెమీనా ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన బెమీనా ప్రాంతంలోని మన్సూర్ కాలనీలో చోటుచేసుకుంది.