Hyd: రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క. సావిత్రీ బాయి ఫూలే జయంతీ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ప్రజా భవన్ లో మహిళలకు ఫిష్ మొబైల్ వాహానాలు అంధించారు సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాదని సావిత్రీ బాయి ఫూలే నిరూపించారని వెల్లడించారు. చదువు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి సావిత్రీ బాయి ఫూలే అన్నారు.
సావిత్రీబాయి ఫూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహిస్తున్నందుకుగాను సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇది మహిళలందరికి గర్వకారణమని చెప్పారు. సావిత్రీబాయిని స్పూర్తిగా తీసుకుని మహిళలందరినీ సాధికారత దిశగా నడిపించేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 17 రకాల వ్యాపారాలతో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని వెల్లడించారు. నాణ్యత, మంచి రుచితో ఆరోగ్యకరమైన చేపల వంటకాలు తయారుచేయాలని సూచించారు. ఫిష్‌ఫుడ్‌కు మంచి బ్రాండ్ క్రియేట్ కావాలని, 100 శాతం సక్సెస్ రేట్ ఉండాలన్నారు. అమ్మ చేతి వంటకు మారుపేరుగా ఇందిరా మహిళా క్యాంటీన్లు ఉండాలని తెలిపారు. సంచార చేపల విక్రయ వాహనాల్లో వ్యాపారాలు విజయవంతం కావాలన్నారు. మండల కేంద్రం వరకు ఈ వ్యాపారం వెల్లాలని ఆకాంక్షించారు.