అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి, అప్పులు చేసి పంటలు పండిస్తే ప్రభుత్వం దాన్యాన్ని కోనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు.
బుధవారం బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిని దిగ్బంధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు రైతులు. గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
స్థానిక తహసీల్దార్ శ్రీధర్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా, అంతకుముందు భువనగిరి మండలం పచ్చళ్లపాడు తండా గ్రామానికి చెందిన గిరిజన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వడ్లు కొనకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.