ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య సోమవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల ఘటనలో ఓ జవాను తీవ్ర గాయపడ్డట్లు తెలుస్తోంది. గరియాబంద్ జిల్లా కన్వర్ భౌడి అటవీ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే, ఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతంలో స్పెషల్ ఫోర్స్ అధికారులు యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహించారు. అడవిలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, మావోల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల ఓ జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జవాన్ ఒడిషా స్పెషల్ ఆపరేషన్‌కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఆయన్ని హుటాహుటిన సమీపంలోని గరియాబంద్ జిల్లా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినట్లు, మెరుగైన చికిత్స కోసం రోడ్డుమార్గంలో రాయ్‌పూర్‌కు తరలించినట్లు గరియాబంద్ జిల్లా ఆసుపత్రికి చెందిన డాక్టర్ హరీష్ చౌహాన్ విలేకరులకు తెలిపారు. బుల్లెట్ జవాన్ మెడభాగంలో ఇరుక్కుపోయినట్లు..ప్రస్తుతం జవాన్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నట్లు అధికారులు తెలిపారు.