- సీఎం పరిశీలనకు మెట్రో డీపీఆర్
- జూన్‌లో ప్రభుత్వానికి నివేదిక
- 70 కిలోమీటర్ల మేర చేపట్టాలని నిర్ణయం
- ఏడు కారిడార్లుగా అలైన్‌మెంట్లు ఖరారు
- నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు
TS: హైదరాబాద్ మహానగరంలో మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమవుతున్నది. మొత్తం 70 కి.మీ మేర నిర్మించే మార్గాలకు సంబంధించి డీపీఆర్‌ను రూపొందించేందుకు అవసరమైన క్షేత్ర స్థాయి అధ్యయనం పూర్తికావచ్చిందని, జూన్ నెలలోనే డీపీఆర్‌ను ప్రభుత్వానికి అందజేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని మెట్రో అధికారి ఒకరు తెలిపారు.
నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా, విమానాశ్రయానికి మెట్రో రైలు మార్గం ద్వారా కనెక్టివిటీ ఉండేలా రెండో దశ మెట్రో నిర్మాణాన్ని 70 కి.మీ మేర చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా 7 మార్గాల్లో అధ్యయనం చేసి డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.20వేల కోట్ల వ్యయం అవుతుందని ఇప్పటికే మెట్రో అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో దీనిపై ప్రకటనలు చేయకుండా, జూన్ 4 తర్వాత కోడ్ ముగిసిన వెంటనే రెండో దశ మెట్రోకు సంబంధించిన డీపీఆర్‌లను ప్రభుత్వానికి అందజేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. పూర్తయిన డీపీఆర్‌లను సీఎం పరిశీలనకు పంపిన తర్వాత కారిడార్‌ల వారీగా టెండర్లు పిలిచే ప్రక్రియను మొదలు పెట్టనున్నారు.