మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య సతీమణి
నిజాం వ్యతిరేక, రైతాంగ పోరాటంలో పాత్ర
సూర్యాపేట జిల్లా చిలుకూరులో నేడు అంత్యక్రియలు
TG: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన దొడ్డా పద్మ (99) కన్నుమూశారు. ఈ నెల 25న సూర్యాపేట జిల్లా చిలుకూరులో ఆమె స్వగృహంలో కాలు జారి కిందపడటంతో తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె కల్పన వెల్లడించారు.
దొడ్డా పద్మ భర్త, దివంగత దొడ్డా నర్సయ్య భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకుడిగా, హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా పని చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సమయంలో దొడ్డా పద్మ తన భర్తతో కలిసి నల్లమల ప్రాంతంలో మూడేళ్లపాటు అజ్ఞాతవాసం గడిపారు. ఆ సమయంలో ఆమె కమ్యూనిస్టు పార్టీ సాహిత్యాన్ని బట్వాడా చేయటం వంటి రహస్య కార్యకలాపాల్లో యాక్టివ్‌గా పాల్గొన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి కొన్నాళ్లు జైలు జీవితం కూడా గడిపారు.
