ఢిల్లీ: కారు బాంబు కేసులో కీలక సాక్ష్యాన్ని సంపాదించారు దర్యాప్తు అధికారులు. బాంబు పేలుడు అనంతరం ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలం నుండి నమూనాలను సేకరించారు. సేకరించిన డిఎన్ఎ నమూల ప్రకారం కారులో వున్న మృతుడిని డాక్టర్ ఉమర్ ఉన్ నబీగా గుర్తించారు. ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి కథనం ప్రకారం సంఘటన తర్వాత డాక్టర్ ఉమర్ తల్లి, అతడి సోదరుడి డిఎన్ఎ నమూనాలను సేకరించి ఎయిమ్స్ ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపారు, అక్కడ వాటిని ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రిలో ఉంచిన మృతదేహాల అవశేషాలతో సరిపోల్చినట్లు తెలిపారు.
ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని ఫోరెన్సిక్ మెడిసిన్ హెడ్ డాక్టర్ సుధీర్ గుప్తా ANIతో మాట్లాడుతూ, DNA ప్రొఫైలింగ్‌ను మానవ గుర్తింపులో వారి DNAలోని ప్రత్యేక విభాగాలను విశ్లేషించడం ద్వారా జీవసంబంధమైన నమూనాతో సరిపోల్చడానికి ఉపయోగిస్తారని తెలిపారు. అనుమానితులను లేదా బాధితులను గుర్తించడానికి ఫోరెన్సిక్ సైన్స్‌లో DNA ప్రొఫైలింగ్ ఒక శక్తివంతమైన సాధనంగా పరిగణించబడుతుందన్నారు. ఇది జీవసంబంధమైన సంబంధాలను కూడా ఏర్పరుస్తుందని తెలిపారు.
మొత్తం 21 జీవ నమూనాలను పరీక్ష కోసం FSL కి పంపినట్లు తెలుస్తోంది ఎర్రకోట పేలుడులో ప్రాథమిక అనుమానితుడితో సహా మొత్తం 12 మంది మరణించారు. మిగిలిన నమూనాలను ఇతర బాధితుల నుండి సేకరించారు. అనేక మంది ప్రాణాలను బలిగొన్న కేసులో ఉమర్ గుర్తింపు ఒక ప్రధాన ముందడుగు అని దర్యాప్తు అధికారులు తెలిపారు. హై సెక్యూరిటీతో కూడిన ఎర్రకోట సమీపంలో ఈ పేలుడు సంభవించడం తీవ్రమైన భద్రతా ఆందోళనలను లేవనెత్తుతోంది.
అయితే, ఫరీదాబాద్‌లోని ఖండావాలి గ్రామంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) బృందం ఒక స్నిఫర్ డాగ్‌తో సోదాలు నిర్వహించగా అక్కడ ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనం ఢిల్లీ పేలుడు కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో ముడిపడి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సోమవారం సాయంత్రం కారు పేలుడు జరగడానికి ముందు, ఉమర్ నబీ రాంలీలా మైదాన్ సమీపంలోని అసఫ్ అలీ రోడ్‌లోని ఒక మసీదులో బస చేశాడని వర్గాలు తెలిపాయి. మసీదు నుండి బయలుదేరిన తర్వాత, నిందితుడు నేరుగా సునేహ్రీ మసీదు పార్కింగ్ స్థలానికి వెళ్లాడు. మధ్యాహ్నం 3:19 గంటల ప్రాంతంలో అతను తన కారును పార్కింగ్ స్థలంలో పార్క్ చేశాడని, దర్యాప్తు సంస్థలు ఉమర్ మొబైల్ ఫోన్ సిగ్నల్ రికార్ట్‌ను పరిశీలిస్తున్నాయని ఆ వర్గాలు తెలిపాయి.
నిందితుల వద్ద హ్యుందాయ్ i20 తో పాటు మరో కారు కూడా ఉందని దర్యాప్తులో తేలిన నేపథ్యంలో, ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలోని అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీస్ పోస్టులు ఇతర సరిహద్దు చెక్‌పోస్టులను అప్రమత్తం చేశారు. ఎరుపు రంగు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారు కోసం వెతకాలని ఆదేశించారు.
ఢిల్లీ కారు పేలుడు కేసులో జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) మాడ్యూల్ ప్రమేయంపై విస్తృత దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఫరీదాబాద్‌లోని ధౌజ్‌లోని అల్-ఫలాహ్ మెడికల్ కాలేజీని సందర్శించే అవకాశం ఉంది.























