AP: డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి పోలీసు విచారణకు డుమ్మాకొట్టారు. ఈరోజు (సోమవారం) విచారణకు హాజరుకావడం లేదంటూ లాయర్ ద్వారా పోలీసులకు వర్మ సమాచారం పంపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేసులో రాంగోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
దీనికి సంబంధించి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదు అయ్యింది. దీంతో విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 19న వర్మ పోలీసుల ఎదుట విచారణకు రావాల్సి ఉండగా.. వారం రోజులు గడువు కావాలని కోరారు. వర్మ విజ్ఞప్తి మేరకు పోలీసులు వారం రోజులు గడువు ఇచ్చారు.
ఈ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని వర్మకు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసు ఇచ్చారు. అయితే ఈరోజు విచారణకు కూడా డైరెక్టర్ డుమ్మా కొట్టేశారు. విచారణకు హాజరుకావడం లేదంటూ తన లాయర్ శ్రీనివాస్‌కు వర్మ సమాచారం ఇచ్చారు. అయితే వర్మ విచారణకు గైర్హాజరైన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.