కళ్లకు గంతలు కట్టి, విద్యుత్‌ షాక్‌లు ఇచ్చి చిత్రహింసలు పెట్టారు

Published on 

ఢిల్లీలో ఇటీవల జరిగిన విద్యార్థి, హక్కుల కార్యకర్తల అరెస్టులు దేశంలోని మానవ హక్కుల భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించాయి. విద్యార్థులను పెట్టిన చిత్రహింసలు సమాజంలోని పలువురిని కదిలించాయి, జామియా మిలియా ఇస్లామియా, ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని విద్యార్థి సంఘాలు సోమవారం నిరసనకు దిగాయి. అక్రమ అరెస్టులపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న పలు మీడియా సంస్థలకు అరెస్టయిన విద్యార్థులు తమ మనోగథాన్ని పంచుకున్నారు.

అరెస్టయిన కార్యకర్తలలో ఒకరైన బాదల్‌ మీడియాతో మాట్లాడారు. ఆమె ఫోరమ్‌ ఎగైనెస్ట్‌ కార్పొరేటైజేషన్‌ అండ్‌ మిలిటరైజేషన్‌ (FACAM)లో సభ్యురాలు. అది ఢిల్లీ వేదికగా పనిచేస్తున్న ఉమ్మడి వేదిక. ఆ సంస్థలో ఢిల్లీలోని విద్యార్థులు, న్యాయవాదులు, మహిళా సంఘాలు, మైనారిటీ హక్కుల సంఘాలు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, మేధావులు, ట్రేడ్‌ యూనియన్లు, కార్మిక హక్కుల సంఘాలు, జర్నలిస్టులు, రచయితలు మొదలైన వాళ్లు క్రీయా శీలంగా పాల్గొంటున్నారు. అది అన్ని సంఘాల ఉమ్మడి వేదిక. దాంట్లో బాదల్‌ కూడా ఒక యాక్టివ్‌ మెంబర్‌. ఇటీవలే తన చదువును పూర్తిచేసుకున్న ఆమె యాక్టివ్‌గా పనిచేస్తుంది.

Baadal

దాదాపు వారం రోజుల పాటు పోలీసుల కస్టడీలో వున్న బాదల్‌ జూలై 18న విడుదలయ్యారు. ‘‘నేను నా స్వస్థలంలో నుండి ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే, ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా నన్ను తీసుకెళ్లారు’’ అని ఆమె చెప్పారు.

‘‘ఒక వారం పాటు నన్ను, ఇతరులను వేర్వేరు సెల్‌లలో ఉంచారు. మమ్మల్ని కొట్టారు. నన్ను మాటలతో వేధించారు. బాగా తాగివున్న ఓ పోలీసు అధికారి కూడా నన్ను అనుచితంగా తాకడానికి ప్రయత్నించారు. అరెస్టయిన మాలో మహిళల కంటే పురుషులను ఎక్కువగా కొట్టారు’’ అని ఆమె తెలిపారు.

వారిని ఎందుకు అరెస్టు చేశారో కూడా తమకు తెలియదని అరెస్టయిన కార్యకర్తలు తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న న్యాయవాదిలో ఒకరు మాత్రం పోలీసులు మాపై ‘‘అర్బన్‌ నక్సల్‌’’ ముద్ర వేసేందుకు కుట్ర పన్నారని వివరించారు.

‘‘మొదటి మూడు రోజులు చాలా దారుణంగా గడిచాయి. మేము మా సెల్‌లో వుంటే పక్కన వున్న వాళ్ల కేకలు వినిపించేవి. దీనిని బట్టే అర్థమయ్యేది వాళ్లను పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని. నా సహచరుడు ఎత్మామ్‌ ఉల్‌ హక్‌, జామియా మిలియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ చదువుతున్నాడు. అతను ముస్లిం ఐడెంటిటీ కారణంగా అత్యంత క్రూరంగా వేధింపులను భరించాల్సి వచ్చింది. అతని కళ్ళకు గంతలు కట్టి, బట్టలు విప్పి, విద్యుత్‌ షాక్‌ ఇచ్చి, అతను నిలబడలేనంతగా కొట్టారు’’ అని ఆ న్యాయవాదికి వివరించారు.

ఎత్మామ్‌ ముస్లిం కావడం వల్ల మతపరమైన దూషణలు ఎదుర్కొవాల్సి వచ్చిందని అతని సహచరులు చెబుతున్నారు. ‘‘ముస్లింలు పది మంది పిల్లలకు జన్మనివ్వడానికి మాత్రమే అమ్మాయిలను గర్భవతి చేయాలని కోరుకుంటున్నారని’’ తిడుతూ, అతని కుటుంబాన్ని కూడా దూషించినట్లు తెలుస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో బూటకప్‌ ఎన్‌కౌంటర్‌లు, మైనింగ్‌ ప్రాజెక్టుల గురించి FACAM గళం విప్పింది, అప్పటి నుండి ఆ సంస్థపై ప్రభుత్వం, నిఘా వర్గాలు అగ్రహంతో వున్నట్లు తెలుస్తోంది.

‘‘నేను ఎంత దారుణమైన పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, పోలీసులు మాతో ఎంత దారుణంగా ప్రవర్తించారో ఊహించలేకపోయాను. కనీస మానవత్వం కూడా మరిచి మాతో ప్రవర్తించారు. ఒక రకంగా ఇది వారి మనస్తత్వం’’ అని బాదల్‌ అన్నారు.

‘‘ఢిల్లీలో ఇక అడుగు పెట్టబోమని’’, ‘‘ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనబోమని’’ హామీ ఇచ్చే పత్రాలపై సంతకం చేయమని బలవంతం చేశారని’’ బాదల్‌ తెలిపారు.

‘‘నేను ఢిల్లీలోకి ఎప్పటికీ అడుగుపెట్టను, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనను, ఢిల్లీలో ఎవరితోనూ మాట్లాడను అని నా తండ్రి బలవంతంగా ఒక ఖాళీ కాగితంపై సంతకం చేసిన తర్వాతే నన్ను విడుదల చేశారు. నేను ఎప్పుడైనా ఢిల్లీకి తిరిగి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు నా తండ్రిని బెదిరించారు’’ అని బాదల్‌ అన్నారు.

ప్రత్యక్ష సాక్ష్యాల ప్రకారం, జూలై 9న కొంతమంది విద్యార్థి కార్యకర్తలను అరెస్టు చేయగా, జూలై 11న మిగతా వాళ్లను అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని కూడా కనీసం కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కూడా పంచుకోకుండా కట్టడి చేసినట్లు సమాచారం.

మొత్తం ఆరుగురిని అరెస్టు చేస్తే దఫల వారిని ఒక్కొక్కరిని విడుదల చేసినట్లు తెలుస్తోంది. వీళ్లలో ఎత్మామ్‌ను మాత్రం కాస్త ఆలస్యంగా శుక్రవారం విడుదల చేశారు.

అరెస్టు చేసిన వెంటనే పోలీసులు అందరి నుండి ఫోన్‌లను జప్తు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వేధింపుల పర్వం, నిరసనలు కొనసాగుతున్న సమయంలోనే ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని జాకీర్‌ హుస్సేన్‌ కళాశాల నుండి రుద్ర అనే మరో విద్యార్థిని కూడా అరెస్టు చేసి విచారణ అనంతరం విడుదల చేశారు..

Ehtmam

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form