సీపీఐ అగ్రనేత సురవరం కన్నుమూత

Published on 

సీపీఐ అగ్రనేత, మాజీ జాతీయ కార్యదర్శి, నలగొండ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (83) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిశారు.

మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25లో జన్మించిన సురవరం.. 1998, 2004లో రెండుసార్లు నల్లగొండ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సీపీఐ విద్యార్థి విభాగం ఏఐఎస్‌ఎఫ్‌ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది.

చండ్ర రాజేశ్వర్‌రావు తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు. 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సురవరం సుధాకర్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్య్రసమరయోధుడు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సురవరం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బీఏ, ఓయూ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 1974లో విజయలక్ష్మితో సుధాకర్‌రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు.

ప్రజల సందర్శనార్ధం సురవరం భౌతిక కాయాన్ని రేపు ఉదయం హిమాయత్ నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధుం భవన్ లో వుంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఊరేగింపుగా వెళ్లి పరిశోధనల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి భౌతిక కాయాన్ని అప్పగిస్తారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form