మే 10న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఆ ఎన్‌కౌంటర్ బూటకమని ఇప్పటికే ఆదివాసీలు, హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. బీజాపూర్ కేంద్రంగా ఆదివాసీలు అందోళన కుడా నిర్వహించారు. తాజాగా ఎన్‌కౌంటర్‌పై ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ బైజ్ మంగళవారం ఒక లేఖను విడుదల చేశారు.
ఈ బృందానికి గిరిజన నాయకుడు, ఛత్తీస్‌గఢ్ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ సంత్రమ్ నేతమ్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఇంద్ర షా మాండవి, విక్రమ్ మాండవి, జనక్ రామ్ ధ్రువ్, సావిత్రి మాండవి, మాజీ ఎమ్మెల్యే దేవ్టీ కర్మ, బీజాపూర్ పంచాయితీ ప్రెసిడెంట్ శంకర్ కుడియం, నారాయణపూర్ జిల్లా అధ్యక్షుడు రాజ్నూర్ నేతం సభ్యులుగా ఉన్నారు. వీలైనంత త్వరగా సవివరమైన నిజనిర్ధారణ నివేదికను సమర్పించాలని ఆయన సభ్యులను కోరారు.
ఈ ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత కవాసీ లఖ్మా కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.