సీఎం రేవంత్ రెడ్డి‌కి బెసిక్ నాలెడ్జ్ లేదు: కేటీ‌ఆర్

Published on 

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బేసిక్‌ నాలెడ్జ్‌ లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఆయన 18 నెలలుగా రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా రంకెలేస్తున్నారని మండిపడ్డారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌కు రచ్చ చేయడం తప్ప.. చర్చ చేయడం రాదని ఎద్దేవా చేశారు.

‘సీఎం రేవంత్‌రెడ్డి..రైతు సమస్యలపై చర్చిద్దాం రమ్మంటే తొక ముడిచి తప్పించుకొని ఢిల్లీకి పారిపోయినవెందుకు? అయినా సవాల్‌ విసరడం.. బురదజల్లడం.. పారిపోవడం నీకు మొదటి నుంచి అలవాటే, నువ్వు రాకుంటే నీ మంత్రినైనా పంపు చర్చకు సిద్ధం..’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. మంగళవారం రైతు సమస్యలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌కు వెళ్లే ముందు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ముఖ్య మంత్రి ముచ్చటపడితే తాను చర్చకు సిద్ధమయ్యాయని కేటీఆర్‌ స్పష్టం చేశారు. గతంలో ఎన్నోసార్లు సవాల్‌ విసిరి తప్పించుకుపోయిన విషయాన్ని గుర్తుచేశారు. ‘కొడంగల్‌లో ఒడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ చేసి ఆరు నెలలు తిరగకముందే మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేస్తివి..హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంట అంటివి..అందుకే నువ్వు మాట మీద నిలబడే మనిషిని కాదు కాబట్టే నీ కొరిక మేరకు కొడంగల్‌లోనైనా, కొండారెడ్డిపల్లిలోనైనా, నీ జూబ్లీహిల్స్​‍ ప్యాలెస్లోనైనా..అంబేద్కర్ చౌరస్తాలోనైనా, చివరికి అసెంబ్లీలోనైనా చర్చకు సిద్ధమని చెప్పినం.. కాదుపోదూ అంటే తటస్థ వేదిక అయినా ప్రెస్‌క్ల‌బ్‌కు మేమే వస్తమని చెప్పినం.. జూలై 8న 11 గంటలకు రమ్మని అడిగినం.. నువ్వు తప్పించుకపోతవని తెలుసు.. నీకు బేషజాలు తప్పా బేసిన్ల గురించి తెలియదని మూడు రోజుల టైమిచ్చినం.. అంటూ దెప్పిపొడిచారు. రేవంత్‌ సవాల్‌ను స్వీకరించి మొన్ననే ప్రెస్‌క్ల‌బ్‌ను బుక్‌ చేశామని తెలిపారు. ఈ రోజూ సీఎం విసిరిన సవాల్‌ను స్వీకరించి కొడంగల్‌లో రైతుబంధు అందని 670 మంది రైతుల జాబితాతో సహా, రుణమాఫీ కానీ రైతుల వివరాలు, రానీ బోనస్, రైతు శ్రేయస్సుకు సంబంధించిన ప్రతి అంశంపై విస్తారంగా చర్చించేందుకు మా నాయకత్వం మొత్తం రైతు సమస్యలపై అధికారికంగా సమాచారం తీసుకొని ఈ రోజు ప్రెస్‌క్ల‌బ్‌కు వెళ్తున్నామని స్పష్టం చేశారు.

ముచ్చటపడి పిలిచిన ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారని తెలిసిందన్నారు. ఒకవేళ ఆయన రాని పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రో, వ్యవసాయ శాఖ మంత్రో, బాధ్యాతాయుతమైన మరో మంత్రి వస్తరని అనుకుంటున్నామన్నారు. అందుకే సోమాజిగూడ ప్రెస్క్లబ్‌కు బయల్దేరి వెళ్తున్నారన్నారు. ‘మా కేం భేషజం లేదు.. ముఖ్యమంత్రే రావాలని లేదు.. ఆయన తరుఫున ఉప ముఖ్యమంత్రి వచ్చినా, ఇంకో మంత్రి వచ్చినా వారితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నం.. చర్చించి వివరాలన్నీ అందజేస్తాం’ అని స్పష్టం చేశారు. రైతుల సబ్జెక్టే కాదు.. తెలంగాణ యువత, అశోక్‌నగర్‌లో చాయ్‌ అడ్డామీద రాహుల్‌గాంధీతో చెప్పించిన 2 లక్షల ఉద్యోగాలపై గానీ, ఆడబిడ్డలకు ఇస్తానన్న నెలకు రూ. 2500 హామీలపై తాము చర్చించేందుకు సిద్ధమా అని ముఖ్యమంత్రి అన్నారు.. ఆయన చెప్పినట్లు ఆ అంశాలపై చర్చించేందుకు సిద్ధమేనని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి మాటమీద నిలబడి చర్చకు వస్తే మంచిదన్నారు. ఒకవేళ ఈ రోజు వీలుకాకుంటే మరోరోజైనా తాము వచ్చేందుకు రెడీగా ఉన్నామని కుండబద్ధలుకొట్టారు. మీరు చెప్పిన సమయం, తేదీ నాడే రెడీగా ఉంటామని స్పష్టం చేశారు. ఏనాడు చర్చకు వచ్చినా రైతులకు కాంగ్రెస్ చేసిన మోసాలను ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, మరోసారి సవాల్‌ విసురుతున్నామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form