కంగనాకు చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్!

Published on 

లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెకు చెంపదెబ్బ కొట్టిన షాకింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరిన కంగనా రనౌత్.. విమానం ఎక్కేందుకు చండీగఢ్ విమానాశ్రయంలో బోర్డింగ్ పాయింట్ కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది.

గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతులను అగౌరవపరిచేలా కంగనా చేసిన వ్యాఖ్యలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చంటూ చర్చిస్తున్నారు. అయితే, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించింది.

అయితే, ఢిల్లీ చేరుకున్న కంగనా ఈ ఘటనపై స్పందిస్తూ తాను బాగానే ఉన్నానంటూ ఓ వీడియోను విడుదల చేశారు. సెక్యూరిటీ చెకింగ్ వద్ద ఈ ఘటన జరిగినట్లు ఆమె అందులో పేర్కొన్నారు. సెక్యూరిటీ చెకింగ్ పూర్తయి పాస్ కోసం వేచి చూస్తున్న సమయంలో సెక్యూరిటీ మహిళా ఆఫీసర్ వచ్చి చెంపదెబ్బ కొట్టిందంటూ తెలిపింది. అదేవిధంగా తనను దూషించినట్లు పేర్కొన్నారు. ఎందుకిలా చేశావని సదరు కానిస్టేబుల్ ను అడుగగా… తాను రైతులకు మద్దతుదారు అని ఆమె చెప్పిందని కంగనా తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని.. కాకపోతే పంజాబ్ లో ఉగ్రవాదం, హింసను ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే తనకు ఆందోళనగా ఉందంటూ కంగనా ఆ వీడియోలో పేర్కొన్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు సంబంధిత అధికారులు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ ను అదుపులోకి తీసుకుని, ఆమెను ప్రశ్నించేందుకు సీఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు కూడా సమాచారం.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form