AP: ప్రకృతి వ్యవసాయంలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే నమూనగా మార్చుతానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాబోయే ఐదేళ్లలో వందశాతం ప్రకృతి వ్యవసాయంగా మార్చేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. ఏ వ్యక్తికి ఏ మందులు అవసరమో ప్రస్తుతం తయారవుతున్నాయని, భవిష్యత్తులో ఏ వ్యక్తికి ఏ ఆహారం అవసరమో అదే పండించే విధానం కుప్పం నుండే ప్రారంభం కావాలని అన్నారు. మన పొలాలే ప్రజలకు శ్రీరామ రక్షగా పంటలు పండించే విధానానికి శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో జనాభా అంతా ఆర్గానిక్ ఆహారమే తినే పరిస్థితి వస్తుందని తెలిపారు. కుప్పం ప్రకృతి వ్యవసాయం విజన్ 2029ను విడుదల చేశారు. అనంతరం శీగలపల్లిలో ప్రకృతి వ్యవసాయ రైతులతో ముఖాముఖి అయ్యారు. రైతులు చేస్తున్న సాగు పద్ధతులను అడిగి తెలుసుకుని వారి అనుభవాలు ఆసక్తిగా విన్నారు.
ఆహారమే మందులు… వ్యవసాయమే ఫార్మసీ:
రాబోయే రోజుల్లో వ్యక్తిగత ఆహారం తప్పకుండా వస్తుందన్నారు సీఎం చంద్రబాబు . ఆహారమే మందులు… వ్యవసాయమే ఫార్మసీగా తయారయ్యే రోజులు వస్తాయన్నారు. ప్రకృతి సేద్యంతో పండించిన ఆహారం తింటే ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రకృతి వ్యవసాయం సహకారానికి ప్రపంచంలోని సంస్థలు ముందుకొచ్చాయన్నారు. ప్రకృతి సాగులో పంటలను చూసినప్పుడు చాలా సంతోషంగా ఉందన్నారు.
త్వరలో 100 రూకార్ట్ సబ్జీ కూలర్లు
రైతు సాధికార సంస్థ సమర్థవంతంగా టెక్నాలజీతో ముందుకెళ్తోందన్నారు. గ్రీన్ ఎనర్జీ, చెత్త నుంచి విద్యుత్ తయారీ, ప్రకృతి వ్యవసాయం అనుకున్నట్లుగా సాధిస్తే ఆసుపత్రులకు వెళ్లే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. గతంలో ఇజ్రాయిల్ టెక్నాలజీతో ఇక్కడికి డ్రిప్ తీసుకొచ్చామన్నారు.