రాయపూర్, మే 1: మావోలతో ప్రభుత్వం చర్చలు జరపాలంటున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్, శాంతి కమిటీ సభ్యులు, మేధావులు, ప్రజాసంఘాలపై ఛత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి విజయ శర్మ మండిపడ్డారు. ‘శాంతి చర్చలు జరపాలని అడగడానికి వారెవరు? ఛత్తీస్ ఘడ్ లో హింసకు పాల్పడుతున్న వారితో వీరికి ఏం సంబంధం’ అని ప్రశ్నించారు. కర్రెగుట్టల ఆపరేషన్ మొదలుకాగానే వీరు బాధను వ్యక్తం చేస్తూ చర్చలు జరపాలని మాట్లాడుతుండటం అనుమానాలకు (దాల్ మే కుచ్ కాలా హై) తావిస్తోందన్నారు.
వీరు తమ మాటల ద్వారా దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారిలో ఎక్కువ మంది తెలంగాణ వారే ఉండటం, వారిలో ఎక్కువ మంది కర్రెగుట్టలపై ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విజయ శర్మ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
