న్యూఢిల్లీ: పాఠశాలల్లో విద్యార్ధుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సీబీఎస్సీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సీబీఎస్సీ పరిధిలోని అన్ని పాఠశాలల్లో హై రిజల్యూషన్‌తో కూడిన సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్ధుల ప్రవేశ, నిష్క్రమణ పాయింట్లు, లాబీలు, కారిడార్లు, మెట్లు, అన్ని తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, క్యాంటీన్ ప్రాంతం, స్టోర్ రూమ్, ఆట స్థలాల్లో హై-రిజల్యూషన్ CCTV కెమేరాలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో సీబీఎస్సీ పేర్కొంది. ఈ మేరకు గత నిబంధనలను సవరిస్తూ సీబీఎస్‌ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా లేఖ రాశారు. టాయిలెట్లు, వాష్‌రూమ్‌లు మినహా దాదాపు అన్ని చోట్లా సీసీటీవీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీసీటీవీ రికార్డింగ్‌లు కనీసం 15 రోజుల డేటా భద్రపరిచి ఉంచాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు అఫిలియేషన్ బై-లాస్‌లో చాప్టర్-4లో సవరణలు CBSE బోర్డు తీసుకొచ్చింది.
కొత్తగా ఏర్పాటు చేసే ఈ సీసీటీవీ కెమెరాలు హై రిజల్యూషన్‌తో ఆడియో విజువల్ సౌకర్యంతో ఉండాలని సీబీఎస్సీ బోర్డు స్పష్టం చేసింది. రియల్ టైమ్ ఆడియో-విజువల్ రికార్డింగ్‌తో కనీసం 15 రోజుల ఫుటేజీ బ్యాకప్ యాక్సెస్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. తాజా నిర్ణయం 2021 సెప్టెంబర్‌లో వచ్చిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) ‘పాఠశాలల్లో పిల్లల భద్రత, భద్రతపై మాన్యువల్’తో సమానంగా ఉంటుందని బోర్డు తెలిపింది. ఇది విద్యార్థుల భావోద్వేగ, శారీరక భద్రత, బెదిరింపుల నుంచి రక్షణ, వారి సమగ్ర అభివృద్ధికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తుందని తెలిపింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఇటువంటి సంభావ్యతలన్నింటినీ నివారించవచ్చని CBSE కార్యదర్శి హిమాన్షు గుప్తా తన ప్రకనటలో పేర్కొన్నారు.
