Canada : కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సొంతపార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రధాని పదవితో పాటు, పార్టీ నాయకత్వానికి రాజీనామాకు సిద్ధమయ్యారు. ట్రూడో మాట్లాడుతూ.. పార్టీలో అంతర్గత పోరుతో వచ్చే ఎన్నికల్లో పోరాడలేనని, దేశానికి అర్హుడైన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ప్రజలకు వస్తుందన్నారు. గత పదేళ్లుగా కెనడా ప్రధానిగా ప్రజల పోరాటపటిమ, సంకల్పం తనలో నిరంతరం స్ఫూర్తిని నింపాయని, ప్రధానిగా తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మధ్యతరగతి ప్రజలు బలోపేతం కావడానికి, వారు అభివృద్ధి పథంలో ముందుకెళ్లడానికి పోరాటం చేశానన్నారు.
ప్రస్తుతం కెనడా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. ఉత్తమ ఫలితాల కోసం ప్రయత్నించినప్పటికీ పార్లమెంట్ నెలల తరబడి స్తంభించిందన్నారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి కుటుంబంతో చర్చించానని, అనంతరమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. లిబరల్ పార్టీకి కొత్త నాయకుడిని ఎన్నకున్న తర్వాత తన పదవులకు రాజీనామా చేస్తానని ట్రూడో పేర్కొన్నారు. తదుపరి ప్రధానిగా ఎన్నికయ్యే వ్యక్తి పార్టీ విలువలను ముందుకు తీసుకెళ్తాడని ఆశిస్తున్నానన్నారు.