చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న తాండూరు డిపో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లతో సహా ఈ ప్రమాదంలో మొత్తం 20 మంది మృతి చెందారు. మొత్తం మృతుల్లో 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. టిప్పర్ ఓవర్ స్పీడ్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.
మృతుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను హుటాహుటీన ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు ఇప్పటివరకు 20 మంది ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానతోపాటు, ప్రైవేటు దవాఖానలకు తలరించారు.
కాగా ఈ ప్రమాదంలో 3 నెలల చిన్నారితో సహా తల్లి మృతి కూడా మృతి చెందింది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా పడుకున్న చిన్నారి ప్రమాదంలో తల్లి చేతుల్లోనే ప్రాణాలు వదిలింది. తల్లీబిడ్డ రోడ్డుపై మృతి చెందిన దృశ్యాలు గుండెను పిండేస్తున్నాయి. విగత జీవులుగా పక్కపక్కనే పడిఉన్న తల్లీబిడ్డల ఫొటో ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తున్నది.























