బీజేపీ తదుపరి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను కమలం పార్టీ వేగవంతం చేసింది. ఈ నెల చివరి నాటికి కొత్త సారథి రానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్న విషయం తెలిసిందే. 2020లో ఆయన బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారింలోకి వచ్చిన తర్వాత నడ్డాను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడితోపాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు. పార్టీ చీఫ్ పదవీకాలం మూడు సంవత్సరాలే అయినప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు.
కాగా, జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించే ముందు కనీసం సగం రాష్ట్ర యూనిట్లలో సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ఇప్పటికే 14 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తయి ఆయా రాష్ట్ర అధ్యక్షుల పేర్లను కూడా ప్రకటించారు. కీలక రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల అధ్యక్షుల పేర్లు ఖరారు కావాల్సి ఉంది. ఈ రాష్ట్రాలకు రెండు, మూడు రోజుల్లో అధ్యక్షులను నియమించే అవకాశం ఉంది. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఈ నెలాఖరికి లేదా వచ్చే నెల ఆరంభంలో ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు పార్టీ అంతర్గత వ్యక్తుల ద్వారా తెలిసింది.
