నేపాలీ కుటుంబంలో ఆశను రేకెత్తిస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం

Published on 

గౌహతి: ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఓ నేపాలి కుటుంబంలో ఆశను రేకెత్తిస్తుంది. అక్టోబర్ 2023 దాడిలో హమాస్ బందీగా తీసుకున్న ఏకైక నేపాలీ హిందువు బిపిన్ జోషి. అతని కుటుంబం గత రెండేళ్లుగా ఆయన కోసం ఎదురుచూస్తోంది.

23 ఏళ్ల నేపాలీ విద్యార్థికి సంబంధించిన ఆచూకి గురించి ప్రస్తుతం అస్పష్టంగానే ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం కొత్తగా విడుదల చేసిన వీడియో అతని కుటుంబానికి కొత్త ఆశావాదాన్ని ఇచ్చింది.

నెలల తరబడి దౌత్యపరమైన చర్చల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి మేరకు ఇజ్రాయెల్ మరియు హమాస్ కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో పాలస్తీనా ఖైదీలకు బదులుగా మిగిలిన ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడం, యుద్ధాలకు తాత్కాలికంగా ముగింపు పలకడం జరుగుతుంది.

హమాస్ దాదాపు 47 మంది బందీలను పట్టుకుందనీ, వారిలో కనీసం 20 మంది సజీవంగా ఉన్నారని భావిస్తున్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడిన సమయంలో హమాస్ తీవ్రవాద సంస్థ మహిళలు, పిల్లలతో సహా 250 మందికి పైగా ప్రజలను కిడ్నాప్ చేసింది. పలు దఫాలుగా బందీలను విడుదల చేసినప్పటికీ హమాస్ చెరలో 47 మంది వున్నట్లు తెలుస్తోంది.బిపిన్ జోషి ఎలా పట్టుకున్నారు…
నేపాలీకి చెందిన 23 ఏళ్ల వ్యవసాయ విద్యార్థి అయిన జోషి “లర్న్ అండ్ ఎర్న్’’ అనే కార్యక్రమంలో భాగంగా అలుమిమ్‌లోని కిబ్బట్జ్‌లోని వ్యవసాయ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇజ్రాయెల్‌కు వచ్చాడు. ఒక పొలంలో పనిచేస్తున్నప్పుడు హమాస్ దాడిలో అతనితో పాటూ తోటి నేపాలీ విద్యార్థులు లక్ష్యంగా మారారు.

హమాస్ దాడి సమయంలో జోషి అద్భుతమైన ధైర్య సాహసాలతో వ్యహరించినట్లు తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రకారం హమాస్ తీవ్రవాదులు విసిరిన గ్రెనేడ్‌ను తిప్పికొట్టి అనేక మంది ఇజ్రాయెలీయులను రక్షించినట్లు పేర్కొంది. హమాస్ దాడికి సమర్ధవంతంగా ఎదుర్కొన్నప్పటికీ ఉగ్రవాదులు నేపాలీ శిక్షణార్థులలో 10 మందిని చంపి జోషిని బంధించారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది.

అపహరణకు కొన్ని క్షణాల ముందు జోషి నేపాల్‌లోని తన బంధువుకు అనేక భావోద్వేగ సందేశాలను పంపినట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి “నాకు ఏదైనా జరిగితే, మీరు నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దృఢంగా ఉండండి. ఎల్లప్పుడూ భవిష్యత్తు వైపు ఆశవాదంతో వుండండి” అని పంపినట్లుగా ఆయన సన్నిహితులు తెలిపారు.

కొత్త వీడియో వెలుగులోకి …
బిపిన్ జోషి కిడ్నాప్ అయిన కొన్ని వారాల తర్వాత హమాస్ 30 సెకన్ల క్లిప్‌ను రికార్డ్ చేసిందని అధికారులు భావిస్తున్నారు. వీడియోలో, అతను తన పేరు, వయస్సు, జాతీయత, ఇజ్రాయెల్‌లో ఉండటానికి గల కారణాన్ని పేర్కొన్నాడు.

“నా పేరు బిపిన్ జోషి. నేను నేపాల్ నుండి వచ్చాను. నా వయసు 23 సంవత్సరాలు… నేను ‘లెర్న్ అండ్ ఎర్న్’ ప్రోగ్రామ్ కోసం ఇక్కడికి వచ్చాను. నేను ఒక విద్యార్థిని,” అని అతను వీడియోలో చెబుతున్నట్లుగా అందులో వుంది. ఆ విడియోలో ఆయన తీవ్ర ఒత్తిడి మధ్య మాట్లాడినట్లు తెలుస్తోంది.

జోషి కుటుంబానికి ఈ వీడియో సందేశం ఆయన సజీవంగా వున్నాడనడానికి ఒక ముఖ్యమైన సంకేతంగా పనిచేస్తుంది. గత రెండు సంవత్సరాలుగా వివిధ అంతర్జాతీయ వేదికల ద్వారా అతని విడుదల కోసం విజ్ఞప్తి చేస్తున్నారు వారు. ఇప్పుడు అతను ఇంకా బతికే ఉన్నాడనే నమ్మకంతో తిరిగి ఉత్తేజితమవుతున్నట్లు తెలుస్తోంది.

“ఈ వీడియో అతని దృఢ విశ్వాసానికి నిదర్శనం” అని కుటుంబ సభ్యుడు అన్నారు. “బిపిన్ బతికే ఉన్నాడని మేము నమ్ముతున్నాము. అతను సురక్షితంగా తిరిగి రావడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు చేయాలని మేము పిలుపునిస్తూనే ఉన్నాము.” అని పేర్కొన్నారు.

సోదరుడి విడుదల కోసం పోరాటం..
బిపిన్ కిడ్నాప్ చేయబడిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, అతని కుటుంబం మొదటిసారిగా టెల్ అవీవ్‌లోని బందీల కూడలికి వచ్చింది. జోషి సోదరి 18 ఏళ్ల పుష్ప మాట్లాడుతూ, “ఇక్కడికి రావడానికి మాకు 22 నెలలు పట్టింది. మేము నేపాల్‌లో ఒంటరిగా ఉన్నాము” అని పేర్కొంది. జోషి కిడ్నాప్ నాటికి ఆమె వయసు 15 సంవత్సరాలు. తన సోదరుడి విడుదల కోసం ఆమె విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమెరికాలో వున్న ఆమె ప్రతిరోజు ఉన్నతాధికారులను సంప్రదిస్తూ సోదరుడి విడుదలకై ఒత్తిడి తీసుకొస్తుంది.

తన సోదరుడిని ఉద్దేశించి నేపాలీలో, “నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఆశను కోల్పోకండి, బలంగా ఉండండి, సజీవంగా ఉండండి!” అని తెలిపింది.

“నా సోదరుడు తనకు సంబంధం లేని యుద్ధంలో చిక్కుకున్న విద్యార్థి,” అని పుష్ప తెలిపింది. “నా తల్లిదండ్రులు కష్టాలే భరించలేక నిరాశ చెందారు. వారు తమ ఏకైక కొడుకును కోల్పోతున్నారు. నా ప్రాణ స్నేహితుడిని నేను మిస్ అవుతున్నాను – అరటి చిప్స్ తయారు చేయడానికి అరటిపండ్లు పెంచాలని కలలు కనేవాడు. సృజనాత్మక, ఫన్నీ వ్యక్తి,” అని ఆమె చెప్పుకొచ్చింది.

జోషి విడుదలపై అస్పష్టత
ఇజ్రాయెల్ – హమాస్ మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత, విడుదల చేయాల్సిన 20 మంది ఖైదీల జాబితాను బహిరంగంగా ప్రకటించారు. అయితే నేపాల్‌కు చెందిన బిపిన్ జోషి ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.

ఇజ్రాయెల్‌లోని నేపాల్ రాయబారి ధన్ ప్రసాద్ పండిట్, బిపిన్ ప్రస్తుత స్థితి అస్పష్టంగానే ఉందని ధృవీకరించారు. అతని గురించి విశ్వసనీయ సమాచారాన్ని పొందడానికి అధికారులు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అక్టోబర్ 7న కిబ్బట్జ్ ప్రాంతంలో జరిగిన దాడిలో బిపిన్ జోషిని హమాస్ బందీగా తీసుకుంది, ఆ ఘటనలో 10 మంది నేపాలీ విద్యార్థులు మరణించారని ఆయన అన్నారు.

నేపాలీ రాయబారి ప్రకారం, బందీల విడుదల జాబితాలో 20 మంది ఇజ్రాయెల్ పౌరులు మాత్రమే ఉన్నారు. బిపిన్ చివరి సారిగా కనిపించిన ప్రదేశం గాజాలోని అల్ షిఫా హాస్పిటల్. నవంబర్ 17, 2023న చివరి సారి ఆ ప్రాంతంలో గుర్తించారు. ఇక అప్పటి నుండి అతని పరిస్థితి తెలియదు. హమాస్ ఇటీవల విడుదల చేసిన 33 సెకన్ల వీడియో కూడా ఆ కాలం నాటిదని తెలుస్తోంది.

నేపాలీ విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందనీ, ఖచ్చితమైన సమాచారాన్ని పొందడానికి ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదిస్తోందని. బిపిన్ పరిస్థితికి సంబంధించిన సమాచారం కోసం మంత్రిత్వ శాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతోందని కుటుంబ సభ్యులకు సూచించారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form