- మార్చి 31 వరకు బెయిల్ మంజూరు
- అనుచరులను కలవరాదని కండిషన్
అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మైనర్‌ను లైంగికంగా వేధించిన కేసులో అతనికి జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే . శారీరక అస్వస్థత కారణంగా ఆయనకు మార్చి 31 వరకు బెయిల్ మంజూరైంది. ఆశారాం బాబా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గతంలో ఆయనకు ఒకసారి గుండెపోటు వచ్చింది. అయితే బెయిల్ వచ్చినా ఆశారాం బాపు పలు షరతులను పాటించాల్సి ఉంటుందని అతని తరపు న్యాయవాది తెలిపాడు.
85 ఏళ్ల స్వయం అశారం తన అనుచరులను కలవరాదని, జైలు నుంచి బయటకు వచ్చాక సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో, బయట ఉన్నప్పుడు అతని కదలికలపై నిఘా ఉంచాలని పోలీసులను కోరారు. ఆశారాం బాపును ఆసుపత్రికి మాత్రమే తీసుకెళ్లాలని సుప్రీం కోర్టు పేర్కొంది.
గతేడాది పూణేలో చికిత్స పొందారు. గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఆయన జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో చేరారు. గతంలో రాజస్థాన్ హైకోర్టు వైద్య చికిత్స నిమిత్తం ఆశారాంను 7 రోజుల పెరోల్‌పై విడుదల చేసింది. అంతేకాకుండా పూణేలో చికిత్స నిమిత్తం 17 రోజుల పెరోల్‌పై విడుదలయ్యాడు.
2013లో ఆశారాం తన ఆశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. 2018లో రాజస్థాన్‌లోని జైపూర్ కోర్టు ఆశారాంను దోషిగా తేల్చింది. అతనికి జీవిత ఖైదు విధించబడింది. అంతేకాకుండా, 2023లో సూరత్‌కు చెందిన విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో గుజరాత్‌లోని కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది.