అమ్మకానికి ఆడ శిశువు

Published on 

  • పీర్జాదిగూడలో పసికందు విక్రయం
  • చిన్నారి ఖరీదు రూ.4.50 లక్షలు
  • పసి బిడ్డలను విక్రయించే ముఠా గుట్టు రట్టు
  • ఆర్‌ఎంపీ డాక్టర్‌తో పాటు మరో ఇద్దరు అరెస్టు

TS: ముక్కు పచ్చలారని పసికందును అమ్మకానికి పెట్టిన ఘటన కలకలం రేపింది. సభ్య సమాజం తలదించునేలా ఆడ శిశువుని విక్రయించి డబ్బులు పోగేసుకుంటున్నారు కొందరు ముఠా సభ్యులు.

పోలీసుల కథనం ప్రకారం.. పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని రామకృష్ణనగర్‌ కాలనీలో ఉంటున్న ఐతె శోభారాణి (48) స్థానికంగా ఆర్‌ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తుంది. కొంత కాలంగా ఉప్పల్‌ ఆదర్శనగర్‌ కాలనీకి చెందిన చింత స్వప్న, రామకృష్ణానగర్‌ కాలనీకి చెందిన షేక్‌ సలీం పాషాతో కలిసి విజయవాడ, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో పేద కుటుంబాలకు డబ్బుల ఆశచూపి వారి శిశువులను తీసుకొచ్చి.. పిల్లలు లేనివారికి విక్రయించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన కొందరు మహిళలు స్ట్రింగ్‌ ఆపరేషన్‌లో భాగంగా తమకు ఆడ పిల్ల కావాలని శోభారాణిని సంప్రదించారు. శిశువుకు రూ. 4.50 లక్షలు బేరం కుదుర్చుకున్నారు. ముందుగా రూ.10వేలు అడ్వాన్స్‌గా ఇచ్చి మిగతా డబ్బులు పాపను ఇచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారు.

బుధవారం మధ్యాహ్నం శోభారాణి చిన్నారిని తీసుకువచ్చామని వారికి ఫోన్‌ చేసింది. స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సెంటర్‌కు చేరుకుని విజయవాడ నుంచి తీసుకొచ్చిన పాపను చూసి మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాప వివరాలు తెలుసుకుని ఆర్‌ఎంపీ డాక్టర్‌ శోభారాణి, సహకరించిన స్వప్న, సలీంను అదుపులోకి తీసుకున్నారు. సంరక్షణ నిమిత్తం చిన్నారిని హైదరాబాద్‌ శిశు విహార్‌కు తరలించి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో మరికొందరు ఉండవచ్చని ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form