ఆరోగ్యశ్రీ సీఈవోతో ప్రయివేట్ నెట్ వర్క్ ఆసుప్రతులు జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. బుధవారం సాయంత్రం జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంతో వీరు చర్చలు జరిపారు. కానీ మార్చి31 వరకు ఉన్న పెండింగ్ బిల్లులను చెల్లిస్తేనే ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తామని నెట్ వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి తెలిపాయి. దీంతో రాష్ట్రంలోని ప్రయివేట్ నెట్ వర్క్ ఆసుప్రతుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చర్చల సందర్భంగా ప్రభుత్వం రూ.203 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. కానీ తక్షణమే రూ. 800 కోట్ల బకాయిలు విడుదల చేయాలని ఆసుప్రతులు కోరాయి. ప్రభుత్వం రూ.1500 కోట్లు పెండింగ్ బకాయిలు పెట్టిందని అందులో కనీసం రూ. 800 కోట్లు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
ప్రయివేట్ ఆసుత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రులకు వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. నెట్ వర్క్ ఆసుపత్రులకు పెండింగ్ బిల్లులను కొంత చెల్లించి మిగితా చెల్లింపులు వీలైనంత త్వరగా చేపడతామని సీఈవో తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సహకరించాలని కోరారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు.