Hyderabad: ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వెళ్లాలా? అయితే పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్ ఎక్కాల్సిన అవసరం లేదు. కొత్తగా ఆరాంఘర్-జూపార్కు ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ లో రెండో అతి పెద్ద పై వంతెనను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నాలుగు కిలోమీటర్ల పొడవున ఆరు లేన్లతో పైవంతెన నిర్మాణం జరిగింది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు వెళ్లేందుకు ప్రయాణం సమయం తగ్గనుంది.
ప్రారంభోత్సవం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అతి పెద్ద ఫ్లై ఓవర్ పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హై వే నిర్మించుకున్నామన్నారు. ఆరంఘర్ ఫ్లై ఓవర్ కు పూర్వ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నట్టు ప్రకటించారు.
ఇప్పుడు రెండో పెద్ద ఆరాంఘర్ ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకోచ్చామని చెప్పారు. మూసీ కి పెద్ద ఎత్తున వచ్చిన వరదల నేపథ్యంలో హిమాయత్ సాగర్, ఉస్మాసాగర్ లను నిజాం నిర్మించారని గుర్తు చేశారు. మూసి నదిని తిరిగి పునరుజ్జీవనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం కలిసి జోడీగా హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రధాని మోదీ హయంలో ఒక్క కిలో మీటర్ మెట్రో విస్తరణ చేపట్టలేదని విమర్శించారు. అసదుద్దీన్‌తో కలిసి హైదరాబాద్ అభివృద్ధికి ప్రధానితో కొట్లాడుతామని చెప్పారు.