AP: సౌర, పవన విద్యుత్ రంగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక ఒప్పందాలు చేసుకుంది. దేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ మధ్య మంత్రి లోకేశ్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నారు. వీటి ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ లభించడంతోపాటు ఉపాధి అవకాశాలూ కలగనున్నాయి.
మంత్రి నారా లోకేశ్ సమక్షంలో విద్యుత్ రంగానికి సంబంధించిన కీలక ఒప్పందాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ని పవన విద్యుత్ నైపుణ్య కేంద్రంగా మార్చేందుకు సుజ్లాన్ సహకారంతో యాంత్రిక, ఎలక్ట్రికల్, బ్లేడ్ టెక్నాలజీ, సివిల్, లైసెనింగ్ వంటి కీలక రంగాల్లో దాదాపు 12వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. పవన విద్యుత్ రంగంలో పేరొందిన సుజ్లాన్ సంస్థ దేశ, విదేశాల్లో ఇప్పటికే అనేక మందికి శిక్షణ ఇవ్వడమే గాక, ఉపాధి అవకాశాలు కల్పించింది. పవన విద్యుత్ రంగంలో యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు పొందేందుకు సుజ్లాన్‌తో చేసుకున్న ఒప్పందం ఎంతో దోహదపడుతుందని మంత్రి నారా లోకేశ్ అన్నారు.