AP: సింగపూర్ పర్యటనలో భాగంగా చివరి రోజున పలు కంపెనీలకు చెందిన ప్రముఖులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వం రూపొందించుకున్న ప్రణాళికలను ఆయా సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార వనరులున్నాయని. వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్‌లోని వివిధ దిగ్గజ సంస్థల ప్రతినిధులను కోరారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం కీలక కంపెనీలుగా ఉన్న కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. అయితే రియల్ ఎస్టేట్ సహా పారిశ్రామిక రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కెపిటాల్యాండ్ ఇండియా ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ లెండింగ్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని SMBC మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్ చెప్పారు.
