AP: తిరుపతిలో దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు తొక్కిసలాటలో చనిపోవడం పట్ల దిగ్ర్భాంతి చెందారు. ఈ ఘటన తనకు తీవ్ర బాధ కలిగించిందని అన్నారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై బుధవారం రాత్రి డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సీఎం సమీక్ష నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంపై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనలో గాయాలైన వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీసి.. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ముగ్గురు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, అనిత తిరుపతికి హుటాహుటిన బయలుదేరారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు గురువారం ఉదయం 9.30 గంటలకు తిరుపతి బయలుదేరి వెళ్లనున్నారు.