Amaravathi: సంఘ సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు.
ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. స్త్రీ విద్యపై ప్రప్రధమంగా గళమెత్తిన ఉద్యమకారిణి, ఆదర్శ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194 వ జయంతి సందర్భంగా ఘననివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సావిత్రిబాయి స్ఫూర్తి మనకు ఆదర్శమని సీఎం చంద్రబాబు అన్నారు. ఆనాటి కట్టుబాట్లను కాదని 1848లోనే సావిత్రిబాయి పూలే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించడం అనేది అసామాన్య విషయం. ఆనాటి ఆమె చొరవ తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత సిద్ధాంతానికి ఆలంబనగా మారి మహిళా రిజర్వేషన్లకు దారి తీసిన విషయం తెలిసిందే. కులమత భేదాలకు అతీతంగా సమాజం కోసం తపించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మరొక్క మారు ఘననివాళి అర్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
“ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన వ్యక్తి సావిత్రిబాయి. మనకున్నది ఒకే ఒక శత్రువు, ఆ శత్రువే అజ్ఞానం. విద్యావంతులమై ఆ శత్రువుని తుదముట్టించడమే మన లక్ష్యం” అని… తాను అనుకున్న లక్ష్య సాధన కోసం చివరి శ్వాస వరకు శ్రమించారు. సామాజిక పోరాట యోధురాలు సావిత్రిబాయి స్ఫూర్తిని కొనసాగించడమే మనం అర్పించే ఘన నివాళి అంటూ మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు.