అందెశ్రీ పేరుతో స్మృతి వనం

Published on 

TS: పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ గొప్ప పాత్ర పోషించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా తాను పనిచేసిన సమయంలో.. అందెశ్రీని కలిసి తెలంగాణ ప్రజల సమస్యలపై చర్చించానని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన పాత్ర ఉండాలని తాను కోరానని గుర్తుచేశారు. గద్దర్‌తో పాటు అందెశ్రీ కూడా ప్రజల్లో స్పూర్తి నింపారని ఉద్ఘాటించార

ఆయన రాసిన ప్రతీ పాట తెలంగాణలో స్ఫూర్తిని నింపిందని కీర్తించారు. అందుకే ఆయన రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని మాటిచ్చారు. ఆయన పేరుతో ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆయన పాటల సంకలనం ‘నిప్పుల వాగు’ తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి గైడ్‌గా ఉపయోగపడుతుందని వివరించారు సీఎం రేవంత్‌రెడ్డి.

అందుకే 20 వేల పుస్తకాలను ముద్రించి తెలంగాణలోని ప్రతీ లైబ్రరీలో ‘నిప్పుల వాగు’ ను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గత ఏడాది కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని గుర్తుచేశారు. ఈ విషయంపై ఈ సంవత్సరం కూడా కేంద్రానికి లేఖ రాస్తామని పేర్కొన్నారు. వారికి పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్ సహకరించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అందెశ్రీని పద్మశ్రీతో గౌరవించడానికి కేంద్రమంత్రులు కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

కాగా, ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ పార్ధీవ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈరోజు (మంగళవారం) ఘట్‌కేసర్ చేరుకున్న సీఎం.. అందెశ్రీ అంత్యక్రియలకు హాజరయ్యారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆయన సతీమణిని ఓదార్చారు. అందెశ్రీ పాడెను సీఎం రేవంత్ మోశారు. లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్‌కేసర్ వరకు అంతిమయాత్ర సాగింది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form