ముంబాయి: అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని క్రీడా శాఖకు బదిలీ చేస్తూ సీఎం ఫడణవీస్ ఆదేశాలు జారీ చేయడం మరో వివాదానికి దారి తీసింది. ఈ నిర్ణయంపై సెటైర్లు కూడా ఓ రేంజ్లో పేలుతున్నాయి. రమ్మీని రాష్ట్ర క్రీడాగా ప్రకటించాలని ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన నేత అంబాదాస్ దాన్వే సెటైర్ పేల్చారు. అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలను కార్డ్స్ తీసుకెళ్లనివ్వాలని ఎద్దేవా చేశారు.
ఈ వానాకాలంలో రైతు సమస్యలు ప్రధాన ఎజెండా జరుగుతున్న చర్చపై మంత్రి దృష్టిపెట్టకుండా వ్యవసాయ శాఖ మంత్రి కోకాటే అసెంబ్లీలో రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. మంత్రి మొబైల్లో రమ్మీ ఆడుతున్న వీడియోను తొలుత ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ నెట్టింట పంచుకోవడంతో వివాదం మొదలైంది. పాలక పక్షంపై ప్రతిపక్షం విమర్శలు గుప్పించింది. మంత్రి కోకాటే తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మంత్రి చర్యలు బాధ్యతారహితం, అవమానకరమని మండిపడింది.
మంత్రి తీరుపట్ల విమర్శలు చెలరేగడంతో సీఎం ఫడణవీస్ స్పందించారు. కీలకమైన వ్యవసాయ శాఖ నుంచి ఆయనను తప్పించారు. ఇకపై మంత్రులెవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, వ్యవసాయ శాఖ నుంచి తప్పించాక కోకాటేకు క్రీడా శాఖ, యువత సంక్షేమ శాఖను కట్టబెట్టడంతో సెటైర్లు పేలుతున్నాయి.
