AP: నాలుగున్నరేళ్ల తర్వాత అమరావతి రైతులు ఎట్టకేలకు దీక్షను విరమించి, దీక్షా శిబిరాన్ని ఎత్తివేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం,దానికి తోడు అమరావతే ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించడంతో రైతులు దీక్షను విరమణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత అమరావతి రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కడ నిర్మాణాలు, పనులు వేగవంతం అవుతున్న సమయంలో రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. దీంతో అమరావతికి భూమి ఇచ్చిన రైతులు ఆందోళనలు, నిరసనల బాట పట్టారు. ఒక వైపు దీక్షలు చేస్తూనే మరోవైపు న్యాయపోరాటం చేస్తూ వచ్చారు. అయితే రైతులు కోరుకున్నట్టు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. అమరావతే రాజధానిగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు.