భన్వారీ దేవి అంటే ఈ తరానికి తెలియకపోవచ్చు. కానీ 80- 90ల దశకంలో ఆమె పేరు మారుమోగింది. ఆమె చేసిన పోరాటం నూతన చట్టానికి కారణం అయింది. మహిళల హక్కుల కోసం మార్గదర్శకాలు రూపొందేలా చేసింది. అలుపెరుగని ఆమె పోరాటం నాలుగు కాలాల పాటూ హక్కుల ఉద్యమంలో చర్చించుకునేలా చేసింది. ఈ పయనంలో ఆమె మానాన్ని కోల్పోయింది. సామూహిక అత్యాచారానికి గురైంది. అయితేనేం ఇవాళ చరిత్ర పుటల్లో ఆమె ఓ పాఠ్యాంశం.. ఆమె ఓ స్త్రీవాద శరదృతువు..
భన్వారీ దేవిది రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉండే భటేరి అనే గ్రామం. ఈమె కుమ్హర్ (కుమ్మరి) కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆ గ్రామంలో గుర్జార్ సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇది అక్కడ బలమైన సామాజిక వర్గం. 1990వ దశకంలో రాజస్థాన్ లోని కొన్ని గ్రామాల్లో బాల్యవివాహాలు సర్వసాధారణం. అది కూడా కుల వ్యవస్థ ఆధిపత్యంలో ఉండేది. భన్వారీకి ఐదారేళ్ల వయసులో మోహన్ లాల్ ప్రజాపత్‌తో పెళ్లైంది. వీరికి నలుగురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. పెద్ద కూతురు నిరక్షరాస్యురాలు. ఆమె ఇద్దరు కుమారులు జైపూర్‌లో నివసిస్తున్నారు. చిన్న కూతురు రామేశ్వరి బ్యాచీలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు చదివింది. ప్రస్తుతం ఒక పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్నది.

ఓ మహిళగా..
1985లో భన్వారీ దేవి రాజస్థాన్ ప్రభుత్వం నడుపుతున్న మహిళా అభివృద్ధి ప్రాజెక్టు (డబ్ల్యుడిపి) లో భాగంగా పనిచేసే సాథిన్ (స్నేహితురాలు) అనే సంఘంలో సాధారణ కార్యకర్తగా పనిచేసింది. ఆ ప్రాజెక్టులో భాగంగా భూమి, నీరు, అక్షరాస్యత, ఆరోగ్యం, ప్రజా పంపిణీ వ్యవస్థ, కరువు సహాయక చర్యల్లో, కనీస వేతనాల చెల్లింపు వంటి అంశాలను చేపట్టారు. అదే సమయంలో 1987లో పొరుగు గ్రామానికి చెందిన మహిళపై అత్యాచార యత్నం జరగడంతో ఆందోళన బాట పట్టింది. అలా భన్వారీ దేవి చేసే ప్రతి కార్యక్రమానికి గ్రామ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభించింది. అయితే ఈ సమస్యలన్నింటికీ ప్రధాన కారణం బాల్య వివాహలు. ’బాల్య వివాహంతో నన్ను నేను కోల్పోయా.. ఇది చట్టవిరుద్ధమైనప్పటికీ మన దేశంలో విస్తృతంగా ఉన్నది’. ఇదే మహిళల ఎదుగుదలకు ప్రధాన సమస్య అని గుర్తించింది.

పెళ్లిళ్ల సీజన్ కావడంతో..
రాజస్థాన్‌లో అఖాతీజ్ పండుగ అత్యంత పవిత్రమైంది. ఈ పండుగ సమయంలో వివాహలు చేసుకుంటే మంచిదని అక్కడి వాళ్ల నమ్మకం. ఈ పండుగ సమయంలో గ్రామాల్లో కొన్ని వందల సంఖ్యలో బాల్య వివాహలు జరుగుతాయి. బాల్య వివాహలను ఆపడానికి భన్వారీ 15 రోజుల ముందు నుంచి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయలంటూ నిర్ణయించుకున్నది. బాల్యవివాహాలు నిర్వహించవద్దని స్థానిక గ్రామస్థులను ఒప్పించే బాధ్యతను డబ్ల్యుడిపి సభ్యులు భన్వారీకి అప్పగించారు. ఈ పనిని భన్వారీ.. జిల్లా మహిళా అభివృద్ధి సంస్థ (డిడబ్ల్యుడిఎ) సభ్యులతో కలిసి చేపట్టారు. గ్రామంలో భన్వారీ చేసే మంచి పనులకు మొదట్లో గ్రామస్థుల నుంచి మంచి స్పందన వచ్చింది. రాను రాను.. భన్వారీ ప్రచారాన్ని గ్రామస్థులు పెద్దగా పట్టించుకోలేదు, గ్రామపెద్ద లేదా ప్రధాన్‌తో సహా స్థానిక నాయకుల నుంచి వ్యతిరేకత వచ్చింది. మన సంప్రదాయాలు, కట్టుబాట్లను మార్చేస్తుందని.. గ్రామ పెద్దలు భన్వారీ చేసే ప్రచారాన్ని పూర్తిగా వ్యతిరేకించారు.

1992లో..
1992లో భన్వారీ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తన పోరాటాన్ని మొదలు పెట్టింది. అందులో భాగంగానే అదే గ్రామంలో తొమ్మిది నెలల పసికందును పెళ్లి చేసేందుకు కుటుంబస్థులు, గ్రామస్థులు, పెద్దలు సిద్ధమయ్యారు అయినా భన్వారీ ఆ వివాహాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది.

గుర్జార్ గౌరవాన్ని కించపరిచిందని..
భన్వారీ ఆ వివాహన్ని అయితే అపగలిగింది కానీ పోలీసులు, కార్యకర్తలు వెళ్లిపోయిన తర్వాత ఆ బిడ్డను ఏడాది వయసున్న బాలుడికి ఇచ్చి వివాహం చేశారు. అదే సమయంలో వందలాది మంది చిన్నారుల వివాహం జరిగింది. ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. పెళ్లి జరిగిన ఐదు నెలల తర్వాత, వధువు బంధువులు ప్రతీకారంతో రగిలిపోయారు. దీనిపై ఆగ్రహించిన అగ్రవర్ణాలకు చెందిన పురుషులు భన్వారీపై దాడికి పాల్పడ్డారు, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై జరిగిన సామూహిక అత్యాచారం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఆమెకు మద్ధతుగా దేశవాప్తంగా జరిగిన పోరాటాలు, అత్యాచార విచారణ జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ముఖ్యంశాలుగా నిలిచాయి. ఆమెకు జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ మహిళా హక్కుల సంఘాలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ ఫలితంగా 1997లో సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన ‘విశాఖ మార్గదర్శకాలు’ను రూపొందించడానికి దారితీసింది. ఆగస్టు 13, 1997న సుప్రీం కోర్టు పనిప్రదేశంలో మహిళల లైంగిక వేధింపుల నివారణ కోసం కీలకమైన మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మార్గదర్శకాలు తర్వాత 2013లో ‘పని ప్రదేశంలో మహిళల లైంగిక వేధింపుల నివారణ చట్టం’ (POSH చట్టంగా) రూపాంతరం చెందాయి. ఆమెపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు మహిళా హక్కుల ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలిచింది. భన్వారీ దేవి నిజ జీవితం ఆధారంగా 2000లో జగ్ ముంద్రా, బవాందర్ అనే సినిమాలు కూడా తీశారు.

ఇంకా పెండింగ్‌లో..
ఈ సంఘటనపై పోలీసులు సరిగా వ్యవహరించకపోవడం, ఆ తర్వాత జిల్లా కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది. దిగువ కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించినప్పటికీ, భన్వారీ దేవి తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ కేసు అప్పీల్ రాజస్థాన్ హైకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉంది. అయితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర ఎమ్మెల్యే కన్హయ్య లాల్ మీనా.. ఈ కేసులో నిందితులుగా వున్న వారు.. నిర్దోషులుగా జైలు నుంచి బయటకు రావడంతో వాళ్లకు స్వాగతం పలుకుతూ రాజధాని జైపూర్‌లో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఆ ర్యాలీ కాస్త వివాదాస్పదమైంది.

ప్రస్తుతం..
ప్రస్తుతం భన్వారీ దేవి వయసు 70 ఏళ్లు. శిథిలావస్థలో ఉన్న తన ఇంటి వరండాలో జనపనార మంచం మీద కూర్చుని.. వర్షాలకు నీట మునిగిన ఇంటి వెనుక భాగాన్ని చూస్తూ ఉండిపోయింది. ఊడిపోయిన గోడలు, తుప్పుపట్టిన కిటికీలు, వాతావరణానికి దెబ్బతిన్న ఆమె ఇంటి లోపలి భాగం ఈ రోజుల్లో భన్వారీ దేవి తన ఎముకలలో ఎలా ఉందో ప్రతిబింబిస్తుంది.ఆమె అలసిపోయిన స్త్రీవాది శరదృతువులా ఉన్నది. 1980, 1990లలో భన్వారీ దేవి పేరు గ్రామీణ స్త్రీవాదానికి కొత్త రూపం. ప్రభుత్వ సహయం కోసం నిస్సహాయంగా ఎదురు చూస్తున్నది.
‘నా భర్త 2020లో క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. అతను బతికి ఉంటే బాగుండేది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నా. అతను బతికుంటే నీటి సమస్య, ఇంటి సమస్యలు ఈపాటికే పరిష్కారమై ఉండేది’ అంటూ తన భర్త మోహన్‌ను గుర్తు చేసుకున్నప్పుడు భన్వారీ కళ్లు చెమర్చాయి.

అసంపూర్ణమైన కథ
ఏ బాలిక కోసం అయితే భన్వరీ పోరాడిందో ఆ బాలికకు ఇప్పుడు 32 ఏళ్లు. పేరు బాయి దేవి. భన్వారీ దేవీతో పాటూ అదే గ్రామంలో నివసిస్తుంది. ఊరికి ఒక చివరన భన్వారీ వుంటే.. ఇంకో చివరన బాయీదేవీ వుంటుంది. . చాలాసార్లు ఒకరికొకరు ఎదురుపడ్డా కలుసుకోలేదు. మాట్లాడుకోలేదు. పైగా భన్వారీ దేవి మీద ఆమెకు పీకల దాకా కోపం వున్నట్లు ఆమె మాటల్లో తెలుస్తోంది. ‘నా తండ్రి, మామలను జైలుకు పంపినందుకు భన్వారీని నేను గుర్తుంచుకుంటాను. నేను ఆమెను ప్రతిరోజూ శపిస్తాను‘ అని అంటుంది బాయి దే

చట్టం రూపొందింది కానీ….
భారతదేశం రూపురేకలు వేగంగా మారుతున్నాయి. దేశం ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకుపోతుంది., అణుశక్తి, సాంకేతిక పరిజ్ఞానంలో ముందజలో వుంది. అయినప్పటికీ బాల్య వివాహాల సమస్య ఇప్పటికీ కొనసాగుతున్నది. యునిసెఫ్ లెక్కల ప్రకారం 1.5 మిలియన్ల మంది బాలికలు ఇప్పటికీ ప్రతి సంవత్సరం వివాహం చేసుకుంటున్నారని తెలుస్తోంది.
– స్వేచ్ఛ, జర్నలిస్ట్






















