పొరుగు దేశం నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధాడింగ్ జిల్లాలో ఓ ప్రయాణికుల బస్సు అదుపుతప్పి రోడ్డుకు 300 మీటర్ల దిగువన లోయలో ప్రవహిస్తున్న త్రిశూలి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం ఖాట్మండు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
బస్సు పొఖారా నుంచి ఖాట్మండుకు వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 44 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే నేపాల్ పోలీసులు, ఆర్మీ, సాయుధ బలగాలు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు లోతైన లోయలో పడిపోవడం, లోపల బాగా చీకటిగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ క్లిష్టంగా మారింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఆరుగురు మహిళలు, 12 మంది పురుషులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారిలో ఒక మహిళ, ఒక పురుషుడు న్యూజిలాండ్ దేశానికి చెందిన పర్యాటకులుగా గుర్తించారు. గాయపడిన 26 మందిలో కూడా పలువురు విదేశీ టూరిస్టులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికిగల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, అతివేగం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.























