AP: ర్యాగింగ్ అనేది సరదా కాదనీ, అదొక అమానుషమైన విషయమని ఎస్పీ సుబ్బరాయుడుపేర్కొన్నారు. ఎవరైనా ఎక్కడైనా ర్యాగింగ్‌కు పాల్పడినట్టు తమ దృష్టికి వస్తే జైలుకు పంపి కఠిన శిక్ష అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎస్వీయూనివర్సిటీ శ్రీనివాసా ఆడిటోరియంలో మంగళవారం స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అఫైర్స్ విభాగం ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ కొత్తగా యూనివర్సిటీలో అడుగు పెట్టిన విద్యార్థులను భయపెట్టకుండా స్నేహపూర్వకంగా ప్రోత్సహించడం ప్రతి సీనియర్ బాధ్యత అని గుర్తు చేశార
ర్యాగింగ్ ద్వారా ఎవరికీ ఆనందం రాదని, ఎదుటివారికి మానసిక క్షోభను కలిగిస్తుందన్నారు. అలాంటి ఘటనలు జరిగితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ర్యాగింగ్ ఘటనపై ఫిర్యాదు చేసిన వారికి పూర్తి రక్షణ, న్యాయం అందిస్తామని వివరించారు. ఎస్వీయూ వీసీ నరసింగరావు మాట్లాడుతూ.. ర్యాగింగ్ అనేది విద్యార్థి జీవితాన్ని దెబ్బతీసే దుర్మార్గమైన అలవాటన్నారు. మన యూనివర్సిటీలో ప్రతీ విద్యార్థి సురక్షిత వాతావరణంలో చదువుకునే హక్కు ఉందన్నారు. ఆ హక్కుకు ఎవరైనా భంగం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.
రెక్టార్ అప్పారావు మాట్లాడుతూ.. చదువుతో పాటు మంచి ప్రవర్తనను విద్యార్థులు అలవరుచుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్ భూపతి నాయుడు మాట్లాడుతూ.. ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఇందుకోసం నిరంతరం సాధన చేయాలని కోరారు. అనంతరం ర్యాగింగ్‌కు పాల్పడమంటూ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ భక్తవత్సలం, సీడీసీ డీన్ చెండ్రాయుడు, కల్చరల్ కో-ఆర్డినేటర్ పత్తిపాటి వివేక్, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.























