ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూత

Published on 

హైదరాబాద్‌: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. గత కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామూన తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

1961, జూలై 18న ఉమ్మడి వరంగల్‌ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లన్న. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. ‘మాయమై పోతున్నడమ్మ మనిషన్నవాడు’ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది.

సాహితీ లోకానికి తీరని లోటు: సీఎం రేవంత్ రెడ్డి
అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు.

అధికారిక లాంఛనాలతో
అందెశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును సీఎం రేవంత్‌ ఆదేశించారు.

తెలంగాణకు తీరని లోటు: కేసీఆర్
ప్రముఖ కవి, ‘జయ జయహే తెలంగాణ…’ ఉద్యమ గీత రచయిత డాక్టర్‌ అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో కవిగా తన పాటలతో, సాహిత్యంతో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటన్నారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. అందెశ్రీ మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form