
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (JNUSU) ఎన్నికల్లో వామపక్షాల కూటమి విజయం సాధించింది. నాలుగు కేంద్ర ప్యానెల్ స్ధానాల్లో నాలుగింటినీ క్లీన్ స్వీప్ చేసి ఏబీవీపీ (ABVP)కి చోటులేకుండా చేశారు. దశాబ్ద కాలం తర్వాత గత ఎన్నికల్లో ఏబీవీపీ తరపున వైభవ్ మీనా జాయింట్ సెక్రటరీ పదవిని దక్కించుకున్నప్పటికీ ఈసారి జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కించుకోకుండా తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంది.
గత ఎన్నికలతో పోల్చితే ఈ దఫా జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఓటర్ల నమోదు స్వల్పంగా తగ్గి 67%గా నమోదైంది. 2024-2025 ఎన్నికల్లో 70% విద్యార్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటే, 2023-2024లో 73% మంది ఎన్నికల్లో పాల్గొన్నారు. గత దశాబ్దంలో అదే అత్యధికం. విశ్వవిద్యాలయ ఎన్నికల కమిటీ ప్రకారం, దాదాపు 9,043 మంది విద్యార్థులు ఓటు వేయడానికి అర్హులు.
నవంబర్ 4, 2025న జరిగిన JNUSU విద్యార్థి ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి – ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు తిరిగి మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు జరిగాయి.
ఎన్నికల్లో ప్రధాన అంశాలు
2025 ఎన్నికల ప్రచారం బహుళ సమస్యల చుట్టూ తిరిగింది. మెరుగైన హాస్టల్ వసతి, లైబ్రరీలో మౌలిక సదుపాయాల డిమాండ్, GSCASH పునరుద్ధరణ, NEP ఉపసంహరణ మొదలైన అంశాల చుట్టే ప్రచారం అంతా జరిగింది.
ఐక్య సంఘటనే విజయానికి కారణం..
గత అనవాయితీని కొనసాగిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఉమ్మడిగా పోటీ చేశాయి. సీపీఐ అనుబంధ విద్యార్ధి సంఘమైన ఆల్ ఇండియా విద్యార్థి సమైక్య (AISF) కూటమితో కలిసి పోటీ చేయనప్పటికీ మిగతా వామపక్ష విద్యార్ధి సంఘాలైన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), మరియు డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫ్రంట్ (DSF) లతో కూడిన లెఫ్ట్ యూనిటీ తమ అభ్యర్ధులను బరీలోకి దింపాయి.
AISA నుండి అదితి మిశ్రాను అధ్యక్షురాలిగా పోటీ చేయగా, SFI నుండి K గోపిక ఉపాధ్యక్షురాలిగా, DSF నుండి సునీల్ యాదవ్ జనరల్ సెక్రటరీ పదవికి పోటీ పడ్డాడు. జాయింట్ సెక్రటరీ పదవికి AISA నుండే డానిష్ అలీ పోటి పడ్డాడు. ముఖ్యమైన ఈ నాలుగు స్ధానాల్లో కూటమి అభ్యర్ధులే గెలిచి జేఎన్‌యూలో తమ ప్రభవం ఇంకా తగ్గలేదని చాటుకున్నారు.
ఇతర దళిత, వామపక్ష సంఘాలు కూడా
ప్రధాన పోటీ “వామపక్ష vs కాషాయ” వర్గాల మధ్యే అయినప్పటికీ ఇతర సమూహాలు కూడా తమ ప్రాతినిథ్యం కోసం పోటీ పడ్డాయి. ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ అసోసియేషన్ (PSA) అధ్యక్ష అభ్యర్థి షిండే విజయలక్ష్మి పోటీ చేసినప్పటికీ గెలవలేదు కానీ గణనీయమైన సంఖ్యలో (1,217) ఓట్లను సాధించారు. BAPSA, NSUI, AISF దిశా మొదలైన విద్యార్థి సంఘాలు కూడా వివిధ పదవులకు తమ అభ్యర్థులను నిలబెట్టాయి.
JNUSU అధ్యక్షురాలిగా అదితి మిశ్రా
తన సమీప ప్రత్యర్థి, RSS మద్దతుగల ABVP అభ్యర్థి వికాస్ పటేల్‌ను 449 ఓట్ల తేడాతో ఓడించి JNUSU కొత్త అధ్యక్షురాలిగా అదితి మిశ్రా ఘన విజయం సాధించింది.

JNUSU కొత్త అధ్యక్షురాలు అదితి మిశ్రా
అదితి మిశ్రా ఎవరు?
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన అదితి మిశ్రా పొరుగున ఉన్న బీహార్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసుకుంది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) నుండి ఆర్థిక శాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందింది.
మీడియా నివేదికల ప్రకారం అదితి 2017లో BHU క్యాంపస్‌లో యూనివర్సిటీ అధికారులు అవలంభిస్తున్న విద్యార్ధి వ్యతిరేక విధానాలు, పితృస్వామ్య భావజాలం, మహిళా హాస్టల్ విద్యార్ధినీల సమస్యలపై నిరవధికంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో మొదటిసారి పాల్లొని తన విద్యార్థి ఉద్యమ ప్రస్ధానాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది.
డిగ్రీ తర్వాత పీజీ కోసం పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో చేరిన అదితి మిశ్రా, క్యాంపస్‌లో “కాషాయీకరణ” ప్రచారానికి వ్యతిరేకంగా వైస్ ఛాన్సలర్ కార్యాలయం ముందు జరిగిన ఘెరావ్ కార్యక్రమానికి నాయకత్వం వహించినట్లు ఆమె సోషల్ మీడియా వేదికలో కథనం ద్వారా తెలుస్తోంది.
2019లో జేెఎన్యూలో చేరిన అదితి మిశ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ తీసుకున్న ఏకపక్ష ఫీజుల పెంపుదలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో క్రీయాశీలంగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అలాగే CAA వ్యతిరేక నిరసనలకు సంఘీభావంగా, అదితి వర్సిటీలోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్ధ విద్యార్థులు నిర్వహించిన లాక్డౌన్లో పాల్గొంది.
ప్రస్తుతం, అదితి మిశ్రా జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU)లోని సెంటర్ ఫర్ కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ పొలిటికల్ థియరీ (CCPPT), స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (SIS)లో PhD రెండో సంవత్సరం చదువుతుంది.
గెలుపొందిన తర్వాత విజయోత్సవ ప్రసంగంలో అదితి మిశ్రా మాట్లాడుతూ “మేము JNU ఆలోచన గురించి మాట్లాడేటప్పుడు, ఈ క్యాంపస్‌ను నిర్మించిన కష్టపడి పనిచేసే వ్యక్తుల గురించి తప్పకుండా గుర్తు చేసుకుంటాం. ఇది వారి వారసత్వం, ఎవరైనా దీనిని మా నుండి లాక్కొవాలని ప్రయత్నిస్తే, మేము ఐక్యంగా ఉద్యమిస్తాం’’ అన్నారు.
ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుణపాఠం కావాలి : గోపికా బాబు
JNUSU ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి లెఫ్ట్ యూనిటీ తరపున పోటీ చేసి గెలిచిన అభ్యర్థి గోపికా బాబు మాట్లాడుతూ, “కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతో పాటూ యూనివర్సిటీ రెక్టర్, ప్రొక్టర్, స్టూడెంట్స్ డీన్ మొదలూ యూనివర్సీటీ వైస్ ఛాన్స్లర్ అందరూ ABVP వెనుక వున్నారు. RSS యంత్రాంగమంతా వాళ్ల అభ్యర్ధుల్ని గెలిపించుకునేందుకు కృషి చేశారు. ఉపాధ్యక్ష పదవీ కోసం పోటీ చేసిన తాన్య కుమారి అయితే, ఆమె స్వయంగా తాను బాలసేవికా అని చెప్పుకుంది. ఆమెకు RSS సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. అయినా లెఫ్ట్ కూటమే విజయం సాధించింది” అని అన్నారు.

చిత్తుగా ఓడిన ఏబీవీపీ
ABVP కేంద్ర ప్యానెల్‌ను కోల్పోవడమే కాకుండా 47 కౌన్సిలర్ స్థానాల్లో ఒక్కదాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. వీటితో పాటూ మూడు అంతర్గత కమిటీ (IC) స్థానాల్లో కూడా ABVP ఓడిపోయింది. అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో, గర్విత గాంధీ (AISA) గెలిచింది; పోస్ట్ గ్రాడ్యుయేట్ విభాగంలో, శ్రుతి వర్మ (DSF); PhD విభాగంలో పరాన్ అమితవ (SFI) గెలుపొందారు.
BAPSA చారిత్రాత్మక విజయం
బిర్సా అంబేద్కర్ ఫూలే స్టూడెంట్స్ అసోసియేషన్ (BAPSA) అభ్యర్థి కోమల్ దేవి స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (SSS) నుండి కౌన్సిలర్ పదవిని గెలుచుకున్నారు.

‘‘ఇది 11 సంవత్సరాల తర్వాత SSSలో BAPSA సాధించిన మొదటి విజయాన్ని సూచిస్తుంది – సామాజిక న్యాయం, సమానత్వం ప్రాతినిధ్యం కోసం మా నిరంతర పోరాటంలో ఇది ఒక మైలురాయి’’ అని ఆ సంఘం ప్రకటించుకుంది.
“ఈ విజయం మా స్థలాలను, మా గొంతులను, మా గౌరవాన్ని తిరిగి పొందే దిశగా ఒక అడుగు. మేము కో-ఆప్షన్‌ను తిరస్కరిస్తాము, మేము టోకెనిజాన్ని తిరస్కరిస్తాము, ఇది మా ఆత్మగౌరవం , స్వయంప్రతిపత్తి యొక్క రాజకీయాల” ప్రతిఫలం అని వారు అన్నారు.
అసమ్మతి కి దక్కిన విజయం..
“పాలస్తీనాకు మా మద్దతు గురించి ప్రశ్నించిన వ్యక్తులపై ఇది విజయం. నజీబ్‌కు అన్యాయం చేసిన వ్యక్తులపై ఇది విజయం. జైలులో ఉన్న మా సహచరులను మేము గుర్తుంచుకుంటాం. ఈ విజయం వారిదే” అని సునీల్ యాదవ్ అన్నారు.

“ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్ మాలో సజీవంగా ఉన్నారు. మేము ఎల్లప్పుడూ పోరాడుతున్న పాలస్తీనా ప్రజల తరపున నిలబడతాము. JNU ఎప్పుడూ ఫాసిస్ట్ ప్రభుత్వం ముందు తలవంచదు. దళితులు మరియు ముస్లింలపై ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిపై మేము ఎల్లప్పుడూ పోరాడుతాము” అని డానిష్ అలీ అన్నారు.























