సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని సిమ్లా, మండి సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి వరదలు సంభవించాయి. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ వర్షాలకు ప్రధాన రహదారులు, కాలనీలు నీట మునిగాయి. అనేక ఇళ్లు నేలకూలాయి. జనజీవనం స్తంభించిపోయింది.
మండిలో సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వర్షం ప్రారంభమైంది. తెల్లవారుజామున 1 గంట సమయానికి వర్షం తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు.
సౌలి ఖాద్ నది పొంగిపొర్లుతోంది. ధరంపూర్ సబ్ డివిజన్‌లోని బస్ డిపో పూర్తిగా నీట మునిగింది. దీంతో అనేక బస్సులు నీట మునిగాయి. బస్టాండ్ సమీపంలో ఉన్న కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. అనేక ఇళ్లు నీట మునిగాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి మరణాలూ సంభవించలేదని అధికారులు తెలిపారు.























