కాబూల్: ఆఫ్గానిస్థాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. భూకంప దాటికి ఇంతవరకు 802 మంది మరణించగా, 2,800 మంది గాయపడ్డారని సోమవారం అధికారవర్గాలు తెలిపాయి. తూర్పు రాష్ట్రాలైన కునార్, నంగర్‌హార్‌లలో ఆదివారం అర్ధరాత్రి భూమి కంపించింది. భూమిలోపల పది కిలోమీటర్ల (5 మైళ్లు) లోతులో భూకంప కేంద్రం నమోదయింది. రెక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 6.0 పాయింట్లుగా రికార్డయింది.
అయిదుసార్లు భూమి కంపించడంతో కునార్ ప్రావిన్స్‌లో మొత్తం మూడు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయాయి. ఈ ప్రాంతంలో మట్టితో నిర్మించిన ఇళ్లే అధికం కావడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే సూచనలు ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
అయిదు రాష్ట్రాల్లోని సుమారు 10.20 లక్షల మందిపై భూకంప ప్రభావం ఉంటుందని అమెరికా భూగర్భ సర్వే విభాగం అంచనా వేసింది. రోడ్లు పూర్తిగా పాడవడంతో సహాయ బృందాలు వెళ్లలేకపోతున్నాయి. దాంతో సైన్యమే విమానాల ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తోంది. 40 విమానాలు సేవలు అందిస్తున్నాయని, ఇంతవరకు 420 మంది క్షతగాత్రులను తరలించినట్టు సైన్యం ప్రకటించింది.
నష్టం అధికంగా ఉండడంతో ఆదుకోవాలని తాలిబన్ ప్రభుత్వం పొరుగు దేశాలను కోరింది. 2021లో ఆఫ్గాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటయిన నుంచి చాలా దేశాలు సహాయాన్ని నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ ప్రభుత్వం చేసిన ఈ వినతి ప్రాధాన్యం సంతరించుకొంది. అంతర్జాతీయంగా తమను ఆదుకోవాలని ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి షరాఫత్ జమాన్ కోరారు.
భారీ వర్షాలు కురుస్తుండడం, రోడ్లు పూర్తిగా పాడవడంతో సహాయ బృందాలు వెళ్లలేకపోతునున్నాయని ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ విభాగం అధికారి కేట్ కారే చెప్పారు. నీటి వనరులు కలుషితం కాకుండా జంతువుల కళేబరాలను వెంటవెంటనే తొలగిస్తున్నట్టు తెలిపారు.
