పాలస్తీనాను దేశంగా గుర్తింస్తామని బెల్జియం ప్రకటించింది. ఇప్పటికే ఫ్రాన్స్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, మాల్టా వంటి దేశాలు ఇప్పటికే పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో బెల్జియం చేరింది.
ఈ నెల న్యూయార్క్‌లో జరుగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాలస్తీనాను బెల్జియం అధికారికంగా గుర్తింస్తుందంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి మాక్సిమ్ ప్రివోట్ వెల్లడించారు. పాలస్తీనాలో మారణహోమానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్‌పై కఠినమైన ఆంక్షలు విధిస్తామంటూ ఎక్స్ వేదికగా ప్రకటించారు. గాజాలో జరుగుతున్న మానవతా విషాదం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ చేస్తున్న హింసను ఎదుర్కోవడానికి, ఒక జాతి విధ్వంసాన్ని నివారించాల్సిన బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని ఇజ్రాయెల్, హమాస్‌పై ఒత్తిడి పెంచడానికి బెల్జియం బలమైన నిర్ణయం తీసుకున్నది. ఇది ఇజ్రాయెల్ ప్రజలను శిక్షించడం కాదని, అక్కడి ప్రభుత్వం అంతర్జాతీయ, మానవతా చట్టాలను గౌరవించడంతోపాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని మార్చడానికి ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కాగా, పాలస్తీనాను గుర్తించి, ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించాలన్న తీర్మానానికి బెల్జియన్ ప్రతినిధుల సభ ఆమోదం ఇప్పటికే తెలిపింది.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 9 నుంచి 23 వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని ఫ్రాన్స్, కెనడా, బ్రిటన్ ఇటీవలే ప్రకటించాయి.
