TS: అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మూడేళ్లలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని గుర్తు చేశారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లలో సైతం పగుళ్లు వచ్చాయని చెప్పారు. రీడిజైనింగ్ పేరుతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్చారని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ కేబినెట్ సోమవారం చర్చించిన ఆనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో జరిగిన అవకతవకలను వివరించారు. కట్టిన మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిందని, డిజైనింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్‌లలో లోపాలున్నాయన్న విషయాన్ని NDSA చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జస్టీస్ ఘోష్ ఇచ్చిన నివేధికపై త్వరలో అసెంబ్లీలో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అవకతవకలలో అప్పటి మాజీ సీఎంతో పాటూ హరిష్ రావ్ పాత్ర కూడా వుందని సీఎం తెలిపారు.
