న్యూఢిల్లీ: జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన నెల రోజులు క్రితం ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 81 సంవత్సరాలు.
శిబు సోరెన్ కుమారుడు హెమంత్ సొరెన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా వున్నాడు. తండ్రి మరణవార్తను ఎక్స్ వేదికగా తెలిపారు.
జనవరి 11, 1944న జన్మించిన సోరెన్ బీహార్‌లోని రామ్‌గఢ్ జిల్లా నెమ్రా గ్రామానికి చెందినవాడు. 1977లో శిబు సోరెన్ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి విఫలమయ్యారు. అయితే 1980లో లోక్‌సభలో మొదటి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత 1986, 1989, 1991, 1996లలో విజయాన్ని హస్తగతం చేసుకుంటూ వచ్చారు.
2004లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో శిబు సోరెన్ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా పని చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి శిబు సోరెన్ మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పలు సదస్సులో ఆయన పాల్గోన్నారు.
