ఈశాన్య భారతదేశంతో పాటు అనేక రాష్ట్రాల్లో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురియనున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కేరళ, తమిళనాడులో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ఆగస్టు 6-9 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్లో.. అస్సాం, మేఘాలయలో ఆగస్టు 4, 7-9 మధ్య భారీ వర్షాలు ఉంటాయి.
ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఈరోజు నుంచి వచ్చే మూడు, నాలుగు రోజులు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరోవైపు తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఎక్కువ వర్షాల ప్రభావం ఉంటుందని వెల్లడించింది.
