ఢిల్లీ: భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీకి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. విడాకుల విషయం సోషల్ మీడియాలో అందర్నీ అట్రాక్ట్ చేసింది. ఆ సమయంలో చాహల్ చీటింగ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు ఎలా తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీశాయో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు చాహల్.
చాహల్, ధనశ్రీలు 2020లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరూ కెరీర్ దృష్ట్యా బ్రేకప్ అయ్యారు. అయిదేళ్లకే విడిపోయారు. అయితే
విడాకులు తీసుకున్న సమయంలో తనను చీటర్ అని ఆరోపించారని, కానీ తన జీవితంలో ఎవర్నీ చీట్ చేయలేదన్నాడు. తాను అలాంటి వ్యక్తిని కాదన్నాడు. తనకన్నా నమ్మకమైన వ్యక్తి మరొకరు వుండరన్నాడు. నాతో క్లోజ్‌గా ఉన్నవాళ్ల కోసం నా గుండె నుంచి ఆలోచిస్తానన్నాడు. ఇస్తానే తప్ప, తానేమీ డిమాండ్ చేయనన్నాడు. ఎవరికీ ఏమీ తెలియనప్పుడు, వాళ్లు నిందించడం మొదలుపెట్టారని, అప్పుడు మనం ఆలోచనల్లోకి వెళ్లాల్సి వస్తుందని చాహల్ అన్నాడు.
తనకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారని, వాళ్లతో కలిసి చిన్నతనం నుంచి పెరిగానని, మహిళలను ఎలా గౌరవించాలో తెలుసు అని, వాళ్లను గౌరవించే పద్ధతులను పేరెంట్స్ నేర్పించారని, నా చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నానని, తన పేరును మరొకరితో జోడించి రాయడం, అది కేవలం వ్యూవ్స్ కోసం మాత్రమే రాస్తారని చాహల్ తెలిపాడు.
వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు రావడంతో తన మానసిక ఆరోగ్యం కొంత ఒడిదిడుకులకు లోనైందన్నారు. ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపినట్లు చెప్పాడు. డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలిపాడు. కొన్ని సందర్భాల్లో సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చినట్లు వెల్లడించాడు. జీవితం మీద విరక్తి వచ్చిందని, రోజూ రెండు గంటల పాటు ఏడ్చేవాడినని, కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయేవాడినని, అలా 50 రోజులు జరిగిందన్నాడు. క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నానని, క్రికెట్‌లో బిజీగా ఉండడం వల్ల ఏకాగ్రత కుదరలేదన్నాడు. తనకు కలిగిన సూసైడ్ ఆలోచనల్ని తన స్నేహితుడితో షేర్ చేసుకున్నట్లు తెలిపాడు. కొన్ని సందర్భాల్లో భయం వేసిందన్నాడు.
