న్యూయార్క్: అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలంగాణ సంప్రదాయ బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. గ్రేటర్ న్యూయార్క్, న్యూజెర్సీ చుట్టుపక్కల స్థిరపడిన వందలాది తెలుగు ప్రవాస కుటుంబాలు ఒక్కచోట చేరి బోనాల జాతరను జరుపుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో జరిగిన ఈ పండుగ అమెరికాలో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను చాటింది.
ఇటు తెలంగాణలో ఆషాడ బోనాల సందడి మొదలుకాగానే, అటు అమెరికాలో ప్రవాసులు కూడా జాతరఉత్సవాలకు సిద్ధమయ్యారు. న్యూయార్క్ లో స్థానిక ఐసన్ హోవర్ పార్కులో ఘనంగా బోనాల జాతర జరిగింది. ఆడపడుచు అమ్మాయిలు సంప్రదాయ దుస్తులతో స్వయంగా బోనాలను తయారుచేసి దేవతలకు సమర్పించారు.
