TS: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రెస్టారెంట్ మాటున డ్రగ్స్ దందా నడుపుతున్న ఓ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ కొంపల్లి ప్రాంతంలో అన్నంనేని సూర్య(34) నాలుగేళ్లుగా మల్నాడు కిచెన్ అనే రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు. పబ్‌లకు వెళ్తూ మత్తుమందుల వాడకాన్ని ప్రారంభించిన అతడు.. తర్వాత తానే డ్రగ్ డీలర్ మారాడు. ఈ క్రమంలోనే అతడి గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో మల్నాడు కిచెన్ సమీపంలోనే సూర్య కారును ఆపి ఈగల్ (ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్) బృందాలు సోదాలు నిర్వహించాయి. 10 గ్రాముల కొకైన్, 3.2 గ్రాముల ఓజీ కుష్ (గంజాయి), ఎక్స్‌టసీ మాత్రలను గుర్తించి సీజ్ చేశారు.
2021 నుంచి సూర్య ఇప్పటివరకు వివిధ ప్రాంతాల నుంచి 20 సార్లుకు పైగా డ్రగ్స్ తెప్పించినట్లు తమ విచారణలో తేలిందని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. “సూర్యకు దేశంలోని డ్రగ్స్ స్మగ్లర్లే కాకుండా నైజీరియన్ల నుంచి మత్తుమందులు అందుతున్నాయి. కరీంనగర్‌కు చెందిన జువ్వాది సందీప్, హిమాయత్‌నగర్‌కు చెందిన హర్ష, ఖాజాగూడకు చెందిన పల్లెపాక మోహన్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ డీల్స్ చేస్తున్న నైజీరియన్ల నుంచి డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు గుర్తించాం. హైదరాబాద్‌లోని కొన్ని పబ్‌ల్లో సూర్యతోపాటు అతడి స్నేహితులు డ్రగ్స్ తీసుకున్నారు. డ్రగ్స్ తీసుకునే వారి కోసం ఆయా పబ్‌ల్లో రహస్య గదులను ఏర్పాటు చేశారు. ప్రిజం పబ్, ఫార్మ్ పబ్, బ్లాక్ 22, బర్డ్ బాక్స్, కోరా, బ్రాడ్ వే, క్వాక్ ఎరీనాలో సూర్య డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ఈ పబ్‌లపై చర్యలు తీసుకుంటాం. సూర్య డ్రగ్స్‌ను వ్యాపారవేత్తలు, ఐటీ ఉద్యోగులు, జిమ్ పార్టనర్లు, డాక్టర్లు, పబ్ డైరెక్టర్లకు అమ్మేవాడు. అతడి నుంచి ఏపీకి చెందిన డాక్టర్ ప్రసన్న ఏడాదిలో 29 సార్లు డ్రగ్స్ కొన్నాడు” అని వివరించారు.
